TMU పీఠం కోసం అధిపత్య పోరు..

by Anukaran |   ( Updated:2021-02-05 01:40:12.0  )
TMU పీఠం కోసం అధిపత్య పోరు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మజ్దూరు యూనియన్​ (టీఎంయూ) లో కొత్త వివాదం నెలకొంది. కార్మికుల సమ్మె సమయంలో జేఏసీ నేతగా వ్యవహరించిన యూనియన్​ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాగ్రహానికి గురైన యాజమాన్యంతో ఉద్యోగం నుంచి తీసేసినట్టు నోటీసులకు వెళ్లిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడిని తానేనని, యూనియన్​ తనదేనని అశ్వత్థామరెడ్డిని బహిష్కరించామని థామస్​రెడ్డి ప్రకటించగా, అసలైన టీఎంయూ మాదేనని, థామస్​రెడ్డిని ఎప్పుడో బహిష్కరించామని, సమ్మె తర్వాత రాజీనామా చేశాడని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

గౌరవాధ్యక్ష స్థానంలో ఎవరూ లేరు..

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలోనే యూనియన్లన్నీ రద్దు చేసినట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో కొన్ని రోజుల పాటు యూనియన్ల అంశమే లేదు. కానీ టీఎంయూలో కీలకంగా ఉన్న అశ్వత్థామరెడ్డి, థామస్​రెడ్డి బహిరంగ విమర్శలకు దిగడంతో ఇప్పుడు వివాదం మళ్లీ రచ్చకెక్కింది. గత నెల 31న అశ్వత్థామరెడ్డి యూనియన్​ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించగా, దానికి ముందే థామస్​రెడ్డి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా ఒకే యూనియన్​లో రెండు వర్గాలు విభేదాలకెక్కాయి. ఇదే సమయంలో టీఎంయూ గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవితను ఎన్నుకునేందుకు థామస్​రెడ్డి వర్గం నిర్ణయం తీసుకోగా, అశ్వత్థామరెడ్డి వర్గం కొట్టిపారేస్తూ గౌరవాధ్యక్ష స్థానం ఎవరికీ లేదని చెబుతున్నారు. అలాగే, అసలైన వర్గం తమదేనని 7వ తేదీన కేంద్ర సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్టు కూడా ప్రకటించారు.

వేతన వ్యవహారంపై చర్చ..

ప్రస్తుతం ఆర్టీసీలో వేతనాల వ్యవహారం చర్చగా మారింది. కార్మికులకు జీతాలు పెంచే విషయమై పరిశీలించాలని సీఎం కేసీఆర్​ చెప్తే అధికారులు సాధ్యం కాదని నివేదికిచ్చారు. ఈ అంశంపై అశ్వత్థామరెడ్డి స్పందించి వేతనాలపై టీఎంయూ తరఫున పోరాటం చేస్తామంటూ ప్రకటించారు. థామస్​రెడ్డి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి తరహాలో సూచించారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయింది. చాలాబస్సులు మూలన పడడంతో కొత్తబస్సులు కొనాల్సిన అత్యవసర పరిస్థితిలో ఉంది. సీసీఎస్​ నిధులనే జమ చేసేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ సమయంలో వేతనాలు పెంపు సాహసోపేతమే అని పలువురు అంటున్నారు.

Advertisement

Next Story