తమిళనాడులో మరో కొత్త పార్టీ.. ఎవరిదంటే!

by Shamantha N |
తమిళనాడులో మరో కొత్త పార్టీ.. ఎవరిదంటే!
X

చెన్నై : తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుందా? అంటే అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఇప్పటికే రజనీకాంత్‌, కమల్ హాసన్ కొత్త పార్టీలకు తెర లేపారు. వీటికి తోడు మరో కొత్త పార్టీ తమిళనాడులో అవతరించబోతోంది. ఆ పార్టీని స్థాపించేది ఎవరో కాదు.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు ఎంకే అళగిరినే.

చెన్నైలోని గోపాలపురంలో తన అమ్మను కలిసిన అనంతరం ఎంకే అళగిరి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పని చేయనని తేల్చిచెప్పారు. ఇతర పార్టీలతో కూడా కలవనని స్పష్టం చేశారు. జనవరి 3వ తేదీన తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటానని అళగిరి పేర్కొన్నారు. ఆ తర్వాత అన్ని విషయాలను మీడియాకు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.

రజనీకాంత్‌ను కలుస్తా..

త్వరలోనే చెన్నైలో రజనీకాంత్‌ను కలుస్తానని అళగిరి చెప్పారు. కానీ రజనీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని రజనీకాంత్ ఈ నెల 3వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని రజనీ రాజకీయ సలహాదారు తమిలరువై మనియాన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఎంకే అళగిరిని 2014లో ఆయన తండ్రి కరుణానిధి డీఎంకే నుంచి బహిష్కరించిన విషయం విదితమే. ఎంకే స్టాలిన్‌తో విబేధాల అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు అళగిరిని సస్పెండ్ చేసినట్లు నాడు పార్టీ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed