నిత్యావసరాల పంపిణీకి ‘పీడీఎస్’ ఏటీఎంలు

by Shamantha N |   ( Updated:2021-01-01 06:00:09.0  )
నిత్యావసరాల పంపిణీకి ‘పీడీఎస్’ ఏటీఎంలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను(బీపీఎల్) ఆదుకునేందుకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థ పీడీఎస్(ప్రజా పంపిణీ వ్యవస్థ). ప్రజల కోసం నిత్యావసర సరుకులను ప్రభుత్వం పీడీఎస్ డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా.. అందుకోసం సరిగ్గా సరుకులు ఇచ్చే సమయానికి రేషన్ షాప్ వద్ద క్యూలో నిలబడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజుకు టైమ్ అయిపోయిందంటే.. మళ్లీ తర్వాతి రోజు రావాల్సిందే. అయితే ఈ తరహా సమస్యలు పరిష్కరించేందుకు కర్నాటక రాష్ట్రప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.. అదే ‘రైస్ ఏటీఎం(Rice ATM)’. దీని ద్వారా ఆటోమేటిక్‌గా నిత్యావసరాలు(బియ్యం, సబ్బులు, ఉప్పు, పప్పు మొదలైనవి) పంపిణీ చేసే యంత్రాన్ని కేంద్రప్రభుత్వ సహకారంతో రూపొందిస్తోంది.

బెంగళూరు నగరంలో ఎక్కువ మంది నివసించే ఓ మురికివాడను ఎంపిక చేసి, అక్కడ నిరుపేద ప్రజలకు ఉపయోగపడేలా ఈ మెషిన్లను ఉపయోగిస్తామని కర్నాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కె. గోపాలయ్య వెల్లడించారు. ఈ మెషిన్ల ఏర్పాటుతో ప్రజలు ఎక్కువసేపు లైన్లలో నిలబడాల్సిన అవసరమే ఉండదని, నిత్యావసరాలు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘అన్నపుర్తి’ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ మెషిన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(యూఎన్ డబ్ల్యూఎఫ్‌పీ UNWFP) భాగస్వామ్యంతో రూపొందిస్తోన్న ఈ మెషిన్లను త్వరలోనే ఇన్‌స్టాల్ చేయనున్నారు. ప్రజలు స్మార్ట్ కార్డు లేదా వేలిముద్రను ఉపయోగించి నిత్యావసరాలను తీసుకున్నేట్లుగా ఈ మెషిన్‌ను తయారు చేస్తున్నారు. కాగా ఈ మెషిన్లు త్వరలోనే కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానాలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Next Story