ధర్నాకు దిగిన కోచ్‌లు

by Shyam |
ధర్నాకు దిగిన కోచ్‌లు
X

దిశ, స్పోర్ట్స్ : కర్ణాటకలో పలు క్రీడల కోచ్‌లు తమ కాంట్రాక్టులు పునరుద్దరించాలని కోరుతూ శనివారం నుంచి బెంగళూరులోని మౌర్య సర్కిల్‌లో ధర్నా చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూత్ ఎంపవర్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ (డీవైఈఎస్)కు అనుబంధంగా పలువురు కోచ్‌లను కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అన్ని రకాల క్రీడలు స్తంభించిపోవడంతో వీరు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ముగ్గురు కోచ్‌లు తమ ఉద్యోగాలకు తిరిగి ఇవ్వాలని, వేతన బకాయిలు కూడా చెల్లించాలని కోరుతూ గత నెలలో ఒక రోజు స్ట్రైక్ చేశారు.

అయినా ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాకపోవడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 మందిగి పైగా కోచ్‌లు డీఐఈఎస్ కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నించారు. కానీ, ఆయన వీరికి అందుబాటులో లేకపోవడమే కాకుండా కనీసం వినతి పత్రాన్నికూడా స్వీకరించలేదు. దీంతో అప్పటికప్పుడు మౌర్య సర్కిల్‌లో ధర్నాకు దిగారు. కర్ణాటక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీషా మంజునాథ్ మాట్లాడుతూ ‘మేం చాలా కాలంగా తమ ఉద్యోగాలను పునరుద్దరించాలని కోరుతున్నాము. ఈ సారి ఎన్ని రోజులైనా ధర్నా విరమించము. మా డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడే ఉంటాము’ అని అన్నారు. షెడ్యూల్ ప్రకారం 2020 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73 మంది కోచ్‌ల ఉద్యోగాలను రెన్యూవల్ చేయాల్సి ఉన్నది. కానీ ఎవరికీ చేయలేదు. దీంతో ఆరుగురు కోచ్‌లు రాజీనామా చేశారని లక్ష్మీషా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed