క్రైం ఓ చోట.. కేసు మరోచోట

by Anukaran |
క్రైం ఓ చోట.. కేసు మరోచోట
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆ స్టేషన్‌లో నేరం జరిగితే మరో స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇన్వెస్టిగేషన్ నుంచి కోర్టులో కేసుపై జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా వేరే స్టేషన్ పోలీసులే పర్యవేక్షించాలి. విచిత్రంగా అనిపిస్తున్నా అక్షరాల ఇది వాస్తవం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాక్షాత్కరిస్తున్న ఈ విధానం రాష్ట్రంలోనే ఎక్కడా ఉండకపోవచ్చు.

లిమిట్స్ ఓ చోట..

ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి ఓ చోట ఉంటే మరో స్టేషన్ పరిధిలో వాటిని నిర్వహిస్తున్నారు. దశాబ్దాల కాలంగా అమలవుతున్నా ఆయా ఠాణాలను వాటి జ్యురిడిక్షన్ ఏరియాలోకి మాత్రం తరలించడం లేదు. దీంతో దశాబ్దాల కాలంగా ఇదే తంతు కొనసాగుతోంది. కరీంనగర్ సిటీలో రూరల్, త్రి టౌన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకే కాంపౌండ్‌లో ఉన్న ఈ ఠాణాలు ఉన్న ప్రాంతం వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఉండడం విచిత్రం. దశాబ్దాల క్రితం ఏర్పాటైన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను గ్రామీణ ప్రాంతంలోకి తరలించకపోవడం విచిత్రం.

జిల్లా ఏర్పాటులో..

నూతన జిల్లాల ఆవిర్భావ సమయంలో ఈ ఠాణా పరిధిలో కొత్తపల్లి స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి స్టేషన్‌ను దాని పరిధిలోనే ఏర్పాటు చేయగా, కరీంనగర్ రూరల్ స్టేషన్‌ను మాత్రం తరలించలేదు. ఇదే ఆవరణలో దాదాపు పదేళ్ల క్రితం అప్పటి డీజీపీ అరవింద్ రావు త్రీ టౌన్‌ను ప్రారంభించారు. అయితే ఈ స్టేషన్ పరిధి మాత్రం వేరే ప్రాంతంలో ఉంది. మొదట్లో ఈ స్టేషన్‌ను సుభాష్ నగర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా అక్కడ ప్రభుత్వ స్థలం లేకపోవడం ఆటంకంగా మారింది. ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ భవనంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలు జరిపినా స్థలం మాత్రం కేటాయించలేదు. దీంతో త్రీ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లు వన్‌టౌన్ లిమిట్స్‌లో కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రూరల్ పోలీసు స్టేషన్ టౌన్ ఠాణా పరిధిలో ఉండడం విశేషం.

వేములవాడ రూరల్ స్టేషన్‌ను..

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఠాణా సేవలు వేములవాడ పట్టణం నుంచే అందిస్తున్నారు. రూరల్ స్టేషన్ పరిధికి చెందిన వారు ఇప్పటికీ వేములవాడ అర్బన్ స్టేషన్ ఆవరణకు రాక తప్పడం లేదు. భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం నూతనంగా ఏర్పడింది. ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఠాణా మాత్రం మహదేవపూర్ స్టేషన్ లిమిట్స్‌లో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేశారు. ప్రభావిత ప్రాంతంలో నిర్మించిన ఈ బ్యారేజీ వద్ద నిరంతరం గస్తీ ఉండాలన్న యోచనతో పల్మెల స్టేషన్‌ను మేడిగడ్డ క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేశారు. కొత్తగా పల్మెల మండలం అయినప్పటికీ అక్కడి ప్రజలు పోలీసులను ఆశ్రయించాలంటే మేడిగడ్డ బ్యారేజీ వరకు వెళ్లక తప్పడం లేదు. గతంలో ఉమ్మడి మండలంగా ఉన్నప్పటికీ తాము పోలీసులను కలిసి ఫిర్యాదు చేసేందుకు తగ్గిన దూరం కేవలం 13 కిలోమీటర్లు మాత్రమేనని పల్మెల మండల ప్రజలు అంటున్నారు. తమ కళ్ల ముందే మండల కేంద్రం ఉన్నా చట్టపరమైన సమస్యల కోసం దూరం వెళ్లక తప్పడం లేదంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed