నిండుకుండలా వై‘కుంఠ’ధామం.. అంతిమ సంస్కారాలు చేసేదెలా..?

by Sridhar Babu |   ( Updated:2021-08-04 05:32:12.0  )
నిండుకుండలా వై‘కుంఠ’ధామం.. అంతిమ సంస్కారాలు చేసేదెలా..?
X

దిశ, హుజురాబాద్ : అంతిమ సంస్కారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆ వైకుంఠ ధామానికి వెళితే.. నీటి సమస్యకు మాత్రం కొదువ లేదు. నీళ్ల కోసం మోటర్ ఆన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే చనిపోయిన వారి చివరి తంతు పూర్తయ్యే వరకూ మాత్రం చితి తడవకుండా చూసుకోవల్సిన బాధ్యత మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ.. ఆ వెరైటీ వైకుంఠ థామం ఎక్కడ ఉందనుకుంటున్నారా..? అందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం చెరువును తలపిస్తోంది.

6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో చనిపోయిన వారి అంతిమ సంస్కారాల కోసం ఉపాధి హామీ పథకం నిధులు రూ.12 లక్షల 60 వేలు, గ్రామ పంచాయతీ నిధులు రూ.లక్షా 70 వేలు కేటాయించారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో నిర్మించిన వైకుంఠ ధామానికి వెళ్లి రావడానికే ఇబ్బందిగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వారికి మరో బెనిఫిట్ కూడా కల్పించినట్టుగా స్థలాన్ని ఎంపిక చేశారు. ఎస్సారెస్పీ కాలువ సమీపంలో నిర్మించిన ఈ వైకుంఠ ధామంలో నీరు వచ్చి చేరడంతో చెరువును తలపిస్తోంది. వైకుంఠ ధామం అంతా కూడా నీరు వచ్చి చేరడంతో దహన సంస్కారం చేయడం ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించకుండా స్థలాన్ని ఎంపిక చేయడమే అందుకు కారణం. ఇంజినీర్లు కూడా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదో అంతుచిక్కకుండా ఉంది. నిత్యం నీరు నిలువ ఉండే ఈ వైకుంఠ ధామంలో శవాల దహనం చేయడం ఎలానో అధికారులకు, పంచాయితీ పాలకవర్గానికే తెలియాలని గ్రామస్తులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ థామాలను సకాలంలో పూర్తి చేయనట్టయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే ఇక్కడ మాత్రం నామమాత్రపు పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా వైకుంఠ ధామాన్ని వేరే చోట నిర్మించాలని కందుగుల గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story