సెలవుపై మున్సిపల్ కమిషనర్… రాజకీయ ఒత్తిడేనా?

by Shyam |
సెలవుపై మున్సిపల్ కమిషనర్… రాజకీయ ఒత్తిడేనా?
X

దిశ, న్యూస్‌బ్యూరో: కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా విధుల్లో చేరిన గంగాధర్ ఆరు రోజులకే సెలవుపై వెళ్ళిపోయారు. సెలవు మంజూరు చేయాలంటూ జిల్లా కలెక్టర్ శరత్‌కు విన్నవించుకున్నారు. పట్టణ ప్రగతి పనులు జరుగుతున్న సమయంలో సెలవు ఇస్తే మొత్తానికే ఎసరొస్తుందన్న ఆందోళన ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. ఉత్సాహంగా పని చేయాలనుకున్న గంగాధర్ ఎందుకు సెలవు పెడుతున్నారో అంతుచిక్కడంలేదు. రాజకీయ ఆగ్రహమే ఇందుకు కారణమన్న వార్తలు తెరపైకి వచ్చాయి. మూడు పదులు కూడా నిండని యువకుడు పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నా సెలవుపై వెళ్ళడానికి దారితీయడానికి బలమైన కారణమే ఉండొచ్చన్న చర్చలూ కామారెడ్డిలో జరుగుతున్నాయి. పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నది మున్సిపల్ సిబ్బందికి తెలియందేమీ కాదు. ఈ కార్యక్రమం ప్రారంభమైన మూడోరోజే కమిషనర్ గంగాధర్ ఎందుకు అసంతృప్తికి గురయ్యారన్నది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.

ఈ నెల 19న మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి మున్సిపాల్టీకి తొలి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో కమిషనర్‌గా వచ్చారు. పట్టణ రూపురేఖలు మారుతాయని అనుకుంటుండగా సెలవుపై వెళ్లడం చర్చకు దారితీసింది. నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిన గంగాధర్ మొదట లేబర్ అధికారిగా ఎంపికయ్యారు. కానీ, మరింత మెరుగైన బాధ్యతల కోసం తపించారు. ఆ ఉద్యోగాన్ని వదులుకుని మళ్లీ పరిక్షలు రాశారు. జైళ్ల శాఖలో ఉద్యోగం వచ్చినా చేరలేదు. గ్రూప్ 2 పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. నేరుగా మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో మున్సిపల్ కమిషనర్‌గా పొస్టింగ్ ఇచ్చింది. స్వంత జిల్లాలోనే పోస్టింగ్ రావడంతో ఆనందంగా విధుల్లో చేరారు.

ఒకపార్టీ నేత సమాచార హక్కు చట్టం కోసం చేసిన దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ హోదాలో పరిశీలించక తప్పలేదు. ఆ దరఖాస్తుకు సమాచారం ఇస్తే ఏ రాజకీయ నేత బండారం బయటపడుతుందనుకున్నారో ఏమో కొద్దిమంది ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నేత గంగాధర్‌తో నేరుగా మాట్లాడినట్లు తెలిసింది. మున్సిపల్ కమిషనర్ అనే పోస్టును కూడా పరిగణనలోకి తీసుకోకుండా అధికారపార్టీ నేత ఒకరు ఆయనపై అగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెంది సెలవుపై వెళ్ళాలనుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఎనిమిది రోజులకే సెలవు మాత్రమే కోరినప్పటికి తిరిగి విధులలో చేరుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సేవ చేయాలనే తలంపే తప్ప రాజకీయాలు, వాటి ప్రలోభాలను పట్టించుకోని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అధికారికి వారం రోజులు తిరగకముందే చేదు అనుభవం ఎదురైంది. తొలుత దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాలనుకున్నప్పటికీ కలెక్టర్ కార్యాలయం జోక్యంతో ఎనిమిది రోజులకు కుదించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన సెలవుపై వెళ్ళడంతో పట్టణ ప్రగతి ఎలా జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిది రోజులకే సెలవు పరిమితమవుతుందా లేక అది దీర్ఘకాలికంగా మారుతుందా అనే చర్చలూ కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక సెలవే అయినట్లయితే తిరిగి ఇన్‌చార్జీ పాలన పునరావృతం కానుందా? గంగాధర్ తీసుకునే నిర్ణయమే దీనికి ముగింపు ఇస్తుంది.

Advertisement

Next Story