గోపీచంద్‌పై జ్వాల మరోసారి ఆరోపణలు

by Shyam |
గోపీచంద్‌పై జ్వాల మరోసారి ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై గుత్తా జ్వాల మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు వచ్చిన అవకాశాలను కోల్పోవడానికి గోపీచంద్ కారణమని ఆమె అన్నారు. ఒకప్పుడు స్టార్ ప్లేయర్‌గా ఉన్న గుత్తా జ్వాల కెరీర్.. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. ‘కెరీర్ పరంగా నేను ఎదుర్కొన్న వేధింపులకు గోపీచందే కారణం. బహిరంగంగా మాట్లాడటం వల్ల తగిన మూల్యం కూడా చెల్లించుకున్నాను. అయినా చెప్పడం మానను. నా సత్తా ఏమిటో గోపీచంద్‌కు తెలిసి కూడా మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇతర రాష్ట్ర క్రీడాకారిణులతో ఆడేవాడు’ అని గుత్తా మండిపడ్డారు. ‘ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు గుర్తింపు రావాలంటే కచ్చితంగా గోపీచంద్ అకాడమీకి చెందిన వాళ్లై ఉండాలి. పతకం వస్తే ఆ క్రెడిట్ గోపీచంద్ దక్కించుకుంటాడు. ఓడిపోతే మాత్రం ఇతర వ్యవస్థలపై నెపం నెట్టేస్తాడు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడి దగ్గర శిక్షణ తీసుకోకుండా వేరే చోటికి వెళ్తే వారికి గుర్తింపు రాకుండా, అవకాశాలు దక్కకుండా చేస్తాడని ఆమె ఆరోపించారు. కేవలం ఆటగాళ్లనే కాదు సహాయక కోచ్‌లను కూడా ఆయన వేధింస్తుంటారని తెలిపారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో అంతర్గత రాజకీయాల కారణంగా విదేశీ కోచ్‌లు తమ పూర్తి పదవీకాలం పని చేయట్లేదని, పురుష షట్లర్ల ఇండోనేషియన్ కోచ్ ముల్యో హండోయో ఇలాగే ఎవరికీ కారణం చెప్పకుండా వెళ్లిపోయాడని గుర్తు చేశారు.

Advertisement

Next Story