Junior Doctors Strike : జూడాల సమ్మెతో ఆసుపత్రుల్లో ఇక్కట్లు…

by Shyam |   ( Updated:2021-05-27 08:27:12.0  )
Junior Doctors Strike : జూడాల సమ్మెతో ఆసుపత్రుల్లో ఇక్కట్లు…
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించడంతో హైదరాబాద్ లోని పలు ప్రభుత్వాస్పత్రులలో ఇబ్బందులు తలెత్తాయి. జూడాలు, రెసిడెంట్ డాక్టర్లు అత్యవసర విధులకు కూడా హాజరుకాకపోవడంతో కొన్ని ఆస్పత్రులలో శస్త్ర చికిత్సలు సైతం వాయిదా పడ్డాయి. ఓపీ విభాగానికి వచ్చిన రోగులు కూడా గంటల సమయం లైన్లో ఎదురు చూడవలసి వచ్చింది. దీంతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కొవిడ్ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గాంధీ ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్య సేవలపై జూడాల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది.

ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. రద్దీ తక్కువగా ఉన్న డిపార్ట్‌మెంట్ల లో సేవలందిస్తున్న వైద్యులను ఇతర విభాగాలలో పని చేయించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూశారు. కింగో కోఠి జిల్లా ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. నిలోఫర్, సరోజినీ తదితర బోధనాస్పత్రులలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈఎన్‌టీ ఆస్పత్రిలో కూడా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించడంతో బ్లాక్ ఫంగస్ రోగుల సేవలకు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ఇతర వైద్య బృందంతో సహాయంతో రోగులకు వైద్య సేవలు అందించారు. ఇక్కడ జూడాలు అందుబాటులో లేనప్పటికీ 20 మంది రోగులకు బ్లాక్ ఫంగస్ శస్త్ర చికిత్సలు నిర్వహించడం గమనార్హం.

మా సేవలను గుర్తించడం లేదు..

ప్రభుత్వ ఆస్పత్రులలో తక్కువ వేతనంతో పని చేస్తూ రోగులకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదని జూడాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, సరోజినీ దేవీ కంటి ఆస్పత్రులలో పని చేసే జూడాలు విధులు బహిష్కరించి ‘వి ఆర్ టు సర్వ్-నాట్ టు సఫర్, వైద్యో రక్షతి రక్షితః’ ‘ప్రజల ప్రాణాలకు మేమున్నాం, మా ప్రాణాలకు ప్రభుత్వం ఉండదా’ ‘ఎక్స్ గ్రేషియా ఈజ్ దెయిర్ రైట్, లైవ్స్ లాస్ట్ ఇన్ కరోనా ఫైట్’ అంటూ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. తాము కోరుతున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు .

డిమాండ్లు ఇవే…

2020 జనవరి నుండి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని, ఇందుకు సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలో, సీనియర్ రెసిడెంట్స్ కు చెందిన ఫైలు ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు జూనియర్ డాక్టర్స్ ప్రతినిధులు తెలిపారు. సుమారు ఆరు మాసాలుగా వీటి అమలు కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్ 10 శాతం వెంటనే అమలు చేయాలని, కొవిడ్ బారిన పడిన హెల్త్ కేర్ వర్కర్స్ (హెచ్సీడబ్ల్యూ), వారి కుటుంబాలకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 2005లో జారీ చేసిన జీఓ 74 ప్రకారం నిమ్స్ లో వైద్య సేవలు, అందించడంతో పాటు ఇన్సూరెన్స్ వర్తింప జేయాలని, నిమ్స్ లో రోగులతో పడకలు ఎల్లప్పుడు నిండి ఉంటున్నందున హెల్త్ కేర్ వర్కర్స్ కు వైద్యం అందడం గగనంగా మారుతోందని, తమ కుటుంబాల కోసం నిమ్స్ లో ఓ బ్లాక్ కేటాయించాలని, పీజీ వరకు చదివే వైద్య విద్యార్థులు విధి నిర్వహణలో మృతి చెందితే వారి కుటుంబాలకు రూ 50 లక్షలు, నర్సులు, ఇతర సిబ్బందికి రూ 25 లక్షలు పరిహారం ఇవ్వాలనేవి తమ ప్రధాన డిమాండ్లని వారు వెల్లడించారు.

Advertisement

Next Story