కరోనా నుంచి కాపాడుకుంటాం.. విరాళాలివ్వండి !

by Shyam |   ( Updated:2020-04-07 10:30:14.0  )

– ప్రజలను కోరిన జూనియర్ డాక్టర్లు

దిశ, న్యూస్ బ్యూరో: కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు జూనియర్ డాక్టర్లు నడుం బిగించారు. కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ రక్షణ కోసం విరాళాలిచ్చి ఆదుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సానిటైజర్లు, ఎన్-95 మాస్కులు, ఫేస్ షీల్డులు కొనుగోలు చేసేందుకు ప్రజలే ముందుకొచ్చి తమకు నిధులు సమకూర్చాలని వారు కోరారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నప్పటికీ, విధానాల లోపం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తమకు ఉండాల్సినన్ని రక్షణ సౌకర్యాలు లేవని డాక్టర్లు వాపోతున్నారు. కరోనా బాధితుల నుంచి తమకూ వ్యాధి సోకితే పరిస్థితి మరింత భయానకంగా తయారవుతుందని వారు ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్లే క్వారంటైన్‌కు వెళితే బాధితుల పరిస్థితి ఊహించలేమని హెచ్చరించారు. తమ రక్షణ పరికరాల కోసం సేకరించే విరాళాల విషయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని తెలిపారు. కాగా, పి. గిరిరాజా అండ్ కేఎన్ఎన్ విష్ణు అనే పేరు, 38777292566 ఖాతా నెంబర్, ఎస్‌బిఐఎన్‌0021110 ఐఎఫ్ఎస్‌సీ కోడ్ గల బ్యాంకు ఖాతాకు విరాళాలు పంపాల్సిందిగా జూనియర్ డాక్టర్లు ప్రజలను కోరారు.

Tags: corona, telangana, junior doctors, seeking donations

Advertisement

Next Story

Most Viewed