నటరాజన్.. పడిలేచిన కెరటం

by Shyam |
నటరాజన్.. పడిలేచిన కెరటం
X

దిశ, స్పోర్ట్స్: చిన్నప్పమ్‌పట్టి.. చెన్నైకి 340 కిలోమీటర్ల దూరంలోని ఒక చిన్న గ్రామం. ఐదుగురు సంతానంలో అతనొకడు. తల్లిదండ్రులు కూలికి వెళ్తే గానీ ఇల్లు గడవదు. అంతటి పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కొడుకు, ఇంటి భారం మోయాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు. క్రికెట్ ఆడతాను అంటే ఊరుకుంటారా? కానీ, ఆ తల్లిదండ్రులు అతడి ఆశకు అడ్డుపడలేదు. ఆ రోజు ఆపి ఉంటే ఈరోజు తంగరసు నటరాజన్ టీమ్ ఇండియాకు దొరికేవాడే కాదు. టెన్నిస్ బంతులతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన నట్టు.. నేడు వైట్ బాల్స్‌తో ప్రత్యర్థులను గడగడలాడిస్తున్నాడు. అయితే, ఇదంతా అంత సులభంగా జరగలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ తీసిన నటరాజన్ మొఖంలో కనిపించిన ఉద్వేగం చూస్తే.. అతడు తన కెరీర్‌లో పడిన కష్టం కనిపిస్తుంది. నేడు టీమ్ ఇండియాలో స్థానం సంపాదించి ఉండొచ్చు. కానీ, నీ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని క్రికెట్‌ నుంచి దూరం చేసిన రోజులున్నాయి. వాటన్నింటినీ అధిగమించిన నట్టూ ప్రస్తుతం అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు.

పేదరికం నుంచి క్రికెటర్‌గా..

చిన్నప్పమ్‌పట్టికి చెందిన తంగరసు, సుజాతలకు ఐదుగురు సంతానం. వీరిలో పెద్దవాడే నటరాజన్. తంగరసు ఆ గ్రామ సమీపంలోని పవర్ లూమ్ ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్లేవాడు. అమ్మ సుజాత ఇంటి దగ్గరే ఒక టిఫిన్ బండి నడిపేది. పవర్ లూమ్ ఉద్యోగం పోవడంతో తంగరసు కూడా ఆ టిఫిన్ సెంటర్‌లోనే పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ నటరాజన్ తల్లిదండ్రులు ఆ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నటరాజన్, స్కూల్ అయిపోగానే సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ ఆడేవాడు. 11 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడుతున్న నటరాజన్ ప్రతిభను తొలిసారిగా జయప్రకాశ్ అనే వ్యక్తి గుర్తించాడు. చిన్నప్పమ్‌పట్టి క్రికెట్ క్లబ్‌ను జయప్రకాశ్ నడిపిస్తుండేవాడు. నటరాజన్ బంతి విసిరే వేగాన్ని గుర్తించి అతడిని తన క్లబ్‌లో చేర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే నటరాజన్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి, ‘మీ అబ్బాయిని క్రికెటర్‌ను చేస్తాను. నాకు ఒక్క పైసా ఇవ్వొద్దు. అతడి బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాన’ని చెప్పాడు. ఐదుగురు సంతానాన్ని పోషించడానికి ఇబ్బంది పడుతున్న వాళ్లు, నటరాజన్‌ను అతడి వద్దకు పంపడానికి ఒప్పుకున్నారు. దీంతో నటరాజన్‌ను తీసుకొని చెన్నై వచ్చిన జయప్రకాశ్ అతడికి క్రికెట్‌లో మెలకువలు నేర్పించాడు. బంతిని మరింత వేగంగా వేయడానికి టెన్నిస్ బంతులను ఉపయోగించి బౌలింగ్ చేయించేవాడు. నటరాజన్‌కు సహజ సిద్ధంగానే యార్కర్లు వేసే కళ అబ్బింది. దానికి టెన్నిస్ బంతుల ద్వారా మరింతగా పదును పెట్టాడు.

రంజీల్లో అవకాశం.. కానీ అంతలోనే..

చెన్నైలోని ఫోర్త్ డివిజన్ క్రికెట్‌‌లో నటరాజన్ ఆడేవాడు. అతడి ప్రతిభను గుర్తించి 2015లో తమిళనాడు రంజీ ప్లేయర్‌గా సెలెక్ట్ చేశారు. అయితే, అదే ఏడాది అతడి బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నేర్చుకున్న యాక్షన్ సరిగా లేదని అనడంతో నటరాజన్ ఒక్కసారిగా కుంగిపోయాడు. అప్పుడు జయప్రకాశ్ మళ్లీ ఏడాదిపాటు శిక్షణ ఇచ్చాడు. అతడి యాక్షన్‌ను మార్పించి బౌలింగ్ కొత్తగా నేర్పించాడు. చిన్నతనం నుంచి నేర్చుకున్నది ఒక ఎత్తయితే, ఆ ఏడాదిపాటు బౌలింగ్ యాక్షన్ మార్చి మళ్లీ బౌలర్‌గా రాణించడం మరో ఎత్తు. అతడి కష్టానికి ఫలితం లభించింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దుండిగల్ డ్రాగన్స్‌కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏడాది లైకా కోవై కింగ్స్ జట్టు అతడిని తీసుకున్నది. 2018లో జరిగిన టీఎన్‌పీఎల్‌ ప్లేఆఫ్స్‌లో కోవై కింగ్స్‌ను గెలిపించాడు. ప్రత్యర్థి జట్టుకు సూపర్ ఓవర్‌లో 15 పరుగులు అవసరముండగా, నటరాజన్ బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులే ఇచ్చాడు. ఆ ఓవర్ మొత్తం యార్కర్లు వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ప్రతిభను గుర్తించిన సెహ్వాగ్

నటరాజన్‌లో యార్కర్లు వేసే ప్రతిభను గుర్తించిన వీరేంద్ర సెహ్వాగ్ అతడిని ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసేలా చూశాడు. 2017లో అతడిని రూ.3 కోట్లతో పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని కేవలం రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. రెండేళ్లపాటు బెంచ్‌కే పరిమితం అయిన నట్టు.. 2020లో తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది హైదరాబాద్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు అతడిని ఆసిస్ పర్యటనకు రిజర్వ్ బౌలర్‌గా ఎంపిక చేశారు. వరుణ్ ఆరోన్ గాయం కారణంగా టీ20 నుంచి తప్పుకోవడంతో నటరాజన్ తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, నవదీప్ సైనీ గాయపడటంతో మూడో వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా తొలి అంతర్జాతీయ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదంటూ తిరస్కరణకు గురైన రోజుల నుంచి ‘ఆసిస్ పర్యటనలో అదరగొడుతున్న నటరాజన్’ అంటూ పేపర్లలో హెడ్డింగ్‌లు వచ్చే స్థాయి వరకు ఎదిగిన నట్టూ భారత జట్టు బౌలింగ్ విభాగానికి ఆశాకిరణంలా మారాడు. ఇదీ నటరాజన్ ప్రస్థానం. అతని క్రికెట్ ప్రయాణంలో నట్టూ పడిలేచిన కెరటం.

గురువుపై ప్రేమతో పచ్చబొట్టు

‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా గురువు జయప్రకాశ్. అతని కోసం నేను ఏం చేయడానికికైనా సిద్ధం. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది జయప్రకాశ్‌కు మాత్రమే. అందుకే నేను బౌలింగ్ చేసే ఎడమ చేయి మణికట్టుపై ‘జేపీ’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ప్రస్తుతం గురువుతో కలిసి మా గ్రామంలోనే ఒక క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నాను. 2020 చాలా మందికి నష్టం కలిగించి ఉండవచ్చు. కానీ నాకు మాత్రం కలిసివచ్చింది. ఐపీఎల్‌లో రాణించడం, టీమ్ ఇండియాకు ఎంపికవడం మాత్రమే కాకుండా నాకు కొడుకు కూడా పుట్టాడు. ఇంతవరకు వాడిని ఫొటోలో చూడటమే కానీ, నా చేతితో తాకలేదు. ఇండియా ఎప్పుడు వెళ్తానా? వాడిని ఎప్పుడు దగ్గరకు తీసుకుంటానా అని ఎదురుచూస్తున్నాను.

Advertisement

Next Story