వేలానికి వరల్డ్ కప్ ఫైనల్ 'టీ షర్ట్‌'

by Shyam |
వేలానికి వరల్డ్ కప్ ఫైనల్ టీ షర్ట్‌
X

ప్రపంచదేశాలన్నీ కరోనా (కోవిడ్ 19) దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. వైద్య సిబ్బంది కరోనాపై పోరాటంలో ముందు వరసలో ఉన్నారు. కానీ చాలా చోట్ల సరైన రక్షణ సామగ్రి లేక వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. యూరోప్ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా.. ఇంగ్లాండ్ లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందించడానికి విరాళాల సేకరణకు ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్ ముందుకు వచ్చాడు. గతేడాది జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వివాదాస్పదమైన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. చివరి బంతికి వివాదాస్పద బైరన్స్ కారణంగా మ్యాచ్ టై కావడం, అత్యధిక ఫోర్లు కొట్టిన ఇంగ్లాండ్ విజేత కావడం తెలిసిందే.

కాగా, ఆ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ పాత్ర కూడా కీలకమే. ఇప్పుడు బట్లర్ ఆ మ్యాచ్‌లో వేసుకున్న టీషర్ట్‌ను వేలానికి పెట్టాడు. దీంతో వచ్చిన సొమ్మును ఇంగ్లాండ్‌లోని రాయల్ బ్రాంప్టన్, హేర్‌ఫీల్డ్ ఆసుపత్రులకు లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తానని చెప్పాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులందరూ సంతకాలు చేసిన టీషర్ట్‌ను ఈ-బేలో వేలానికి ఉంచాడు. అయితే.. బ్రిటన్ టెలివిజన్ సెలబ్రిటీ పియర్స్ మోర్గన్ షర్టు కోసం 10 వేల పౌండ్ల బిడ్ వేయగా.. ప్రస్తుతం బిడ్ 12 వేల పౌండ్ల వరకు చేరుకుంది. మరి వేలం ముగిసే నాటికి ఈ టీషర్ట్ ఎంతకు అమ్ముడు పోతుందో వేచి చూడాల్సిందే.

Tags : Jos butler, England Cricketer, World cup T shirt, Corona help

Advertisement

Next Story

Most Viewed