గొంగిడి మహేందర్ రెడ్డికి ఘోర అవమానం.. వెంబడించి దాడి చేసిన టీఆర్ఎస్ నేతలు

by Shyam |   ( Updated:2023-04-13 17:59:03.0  )
DCCB chairman Gongidi Mahender Reddy
X

దిశ, తుర్కపల్లి(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ గులాబీ నేతల్లో ఉన్నటువంటి అంతర్గత పోరు శనివారం ఒక్కసారిగా బహిర్గతం అయింది. ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఎదుటే ఇరు వర్గాలు గొడవకు దిగారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఆలేరు మండల నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గొంగిడి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. అధ్యక్ష రేసులో ఎనిమిది మంది ఉండగా, ఆయన అభిప్రాయాలు సేకరించారు. చివరకు మండల అధ్యక్షుడిగా పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు.

దీంతో మాజీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్‌తో పాటు ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక ఏకపక్షంగా జరిగిందంటూ, మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేగాకుండా.. మహేందర్ రెడ్డిపై కుర్చీలు విసిరారు. దీంతో సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, దాడికి యత్నించడంతో ఖంగుతిన్న గొంగిడి అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న ఆయన కారును వెంబడించి మరీ అద్దాలను ధ్వంసం చేశారు.

అనంతరం తుర్కపల్లిలోని రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అవమానించేలా గొంగిడి మహేందర్ రెడ్డి ప్రవర్తించాడని, ఆయన కులానికి చెందిన వారికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ ప్రకటించి దళితులకు పెద్దపీట వేస్తోంటే, మహేందర్ రెడ్డి మాత్రం తమ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed