భారతీయులకు కష్టం రానివ్వను : జో బిడెన్

by Anukaran |
భారతీయులకు కష్టం రానివ్వను : జో బిడెన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతోంది. అందులో మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికానే ఉంది. కాగా, వచ్చే నవంబర్‌లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.దీంతో అక్కడ కరోనా పరిస్థితులు పూర్తిగా మారిపోయి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది.అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న భారతీయులు ఓటు బ్యాంకు వారికి చాలా అవసరం. దీంతో అధికార రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ ప్రస్తుతం.. ఎక్కడ క్యాంపెనింగ్‌కు ఇండియన్ ఎన్ఆర్‌ఐ ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ట్రంప్ బాహాటంగానే భారత్‌కు మద్దతు ప్రకటించగా, ఇప్పుడు జో బిడెన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందులో భాగంగానే కాలిఫోర్నియా మాజీ సెనేటర్, భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతి సమావేశంలోనూ తన మద్దతు భారత్‌ కేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జో బిడెన్ భారత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్‌కు అండగా ఉంటానని వివరించారు.

ప్రస్తుతం భారత్ సరిహద్దు వివాదాలతో పాటు, కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడుతోందని.. ఆ సమస్యల పరిష్కారంలో అండగా ఉంటానని ప్రకటించారు అంతేకాకుండా భారతీయులకు అమెరికాలో ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని, దీనివలన ఇరు దేశాల మధ్య స్నేహభావం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పూ ఉండదంటూ జో బిడెన్ పేర్కొన్నారు. కాగా, ఇండియన్ అమెరికన్లు ఎవరికి పట్టంకడుతారో తెలియాలంటే మరింత కొంతకాలం వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story