కొత్త జీవోతోనే కొలువుల భర్తీ…?

by Anukaran |   ( Updated:2021-04-07 11:53:16.0  )
JObs
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలా అనేది ఇంకా తేలడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్లారిటీ లేకపోవడం, జోనల్​ వ్యవస్థ లొసుగులతో హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు 50వేల ఉద్యోగాల భర్తీ పాత జోనల్ వ్యవస్థలో భర్తీ చేస్తారా? లేదా కొత్త జోనల్ వ్యవస్థ భర్తీ చేస్తారా? అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై తేల్చకుండా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి.

రిజర్వేషన్ల సంగతేంటి..?

పాత జోనల్ వ్యవస్థ ప్రకారంగా పది పూర్వ జిల్లాల ప్రాతిపదికన ఆయా పోస్టులకు స్థానిక రిజర్వేషన్ ఉంటుంది. ఇక కొత్త జోనల్ వ్యవస్థలో 33 జిల్లాలు ఉన్నందున స్థానిక రిజర్వేషన్ 95% ఉంటుంది. దీంతో ఏ ప్రతిపాదికన నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా… అసలు ఎన్నికల తర్వాత రెండు కొత్త జిల్లాల ఏర్పాటు మరో సమస్యగా మారింది. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత మరో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో 33 జిల్లాలు కావడంతో మిగతా రెండు జిల్లాలు ఏ జోన్‌ల్లోకి వెళ్తాయనే తేలాల్సి ఉంది. ఈ రెండు జిల్లాలపై కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. ఎన్నికల తర్వాత కొత్త జిల్లాలను ప్రకటించిన అనంతరం పది రోజుల్లో జీవో వస్తుందని కేంద్రమంత్రి అమిత్​షా… సీఎం కేసీఆర్​కు హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు దానిపై ఎలాంటి కదలిక లేదు. అయితే ప్రభుత్వం దీనిపై ఒక కొత్త జీవో విడుదల చేస్తే కొంత ఆశాజనకంగా ఉంటుందని అధికారవర్గాలు చెప్పుతున్నాయి.

ఇలాగైతే ఎలా మరి..?

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య చిక్కుకున్న కొత్త జిల్లాల అంశం నిరుద్యోగులకు నిరాశ కల్గిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలను ఆమోదిస్తూ కేంద్రం నోటిఫై చెయ్యాల్సి ఉంది. దీంతో 50 వేల ఉద్యోగాల భర్తీ కూడా ఆలస్యమవుతోంది. దీంతో ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు ఇచ్చినా… భర్తీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదంటున్నారు. వాస్తవంగా గత ఏడాది డిసెంబర్​ 13న సీఎం కేసీఆర్​ 50 వేల ఉద్యోగాలపై ప్రకటించారు. మూడు నెలల్లో భర్తీ ప్రక్రియ ముగుస్తుందన్నారు. కానీ గడువు దాటిపోయింది.

వాస్తవంగా 2016లో రాష్ట్రంలోని పది జిల్లాలను 31గా… రెండు జోన్లను ఏడు జోన్లుగా చేశారు. ఆ తర్వాత 2017లో రెండు మల్టీ జోన్లను సృష్టించారు. ఈ నిర్ణయాలన్నీ ఆమోదించాల్సిందిగా కోరుతూ కేంద్ర హోశాంఖకు పంపగా… కేంద్రం ఆమోదించిన తర్వాత 2018 మే నెలలో రాష్ట్రపతి జోనల్ మార్పులను ఆమోదించారు. ఆ తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 2019లో సీఎం కేసీఆర్ హామీతో ములుగు, నారాయణపేటలను కూడా కొత్త జిల్లాలుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 33 అయ్యింది. అదనంగా రెండు జిల్లాల ఏర్పాటుతో అప్పటికే ఉన్న జిల్లాల్లో మార్పులతో పాటుగా జోన్లలోనూ మార్పులొచ్చాయి. కానీ ఈ జోన్లలో మార్పుల్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదు.

ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం వస్తే గానీ రాష్ట్రప్రభుత్వం రిక్రూట్‌మెంట్లు చేసే అవకాశం ఉండటం లేదు. ఇది సాంకేతికంగా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే పోస్టుల భర్తీ ఆయా జిల్లాలు, జోన్లను బట్టీ ఉంటుంది. ఏ జిల్లాకు ఎన్ని, ఏ జోన్‌లో ఎన్ని అనేది లెక్కలుంటాయి. అందుకే ముందుగా జోన్ల లెక్క తేలిన తర్వాతే ఉద్యోగాల నోటిఫికేషన్​ ఇవ్వాల్సి ఉంది. ఇది క్లియర్​ కాకుండా ఖాళీల భర్తీ చేపడితే సాంకేతికంగా చాలా సమస్యలు తలెత్తుతాయని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించారు.

ప్రస్తుతం ఉన్న జోన్లు కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ఉండగా… జోన్లు, మల్టీజోన్లను 31 జిల్లాలను లెక్కలోకి తీసుకొని చేశారు. వీటికి కేంద్రం అనుమతి ఉంది. కొత్తగా నిర్మించిన ములుగు, నారాయణపేట జిల్లాలకు ఇంకా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు రెండు కొత్త జిల్లాలు, జోన్లలో మార్పులను కేంద్రం, రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా ఆమోదం రావడం లేదు.

మరోవైపు సీఎం ఆదేశాలతో శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సీఎస్ తీసుకున్నారు. మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే వివరాలను తీసుకున్నారు. వీటిని ఆర్థిక శాఖకు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి క్లియరెన్స్​ వస్తే నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 16 వేల పోస్టులను టీఎస్​పీఎస్సీ నుంచి, మిగిలిన వాటిని మెడికల్​, పోలీస్​ బోర్డులతో నియామకం చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా 50వేల ఉద్యోగాల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలంటే టెట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇప్పటికే టెట్​ నిర్వహించాల్సి ఉండగా… ఇది తేలకపోవడంతో వాయిదా పడుతున్నట్లు సమాచారం.

పాత జిల్లాల వారీగా కొత్త జీవోతోనే..!?

ఉద్యోగాల భర్తీపై వ్యతిరేకత వెల్లడవుతున్న నేపథ్యంలో పాత జిల్లాలు, రెండు జోన్ల వారీగా నియామకం చేసే ప్రక్రియపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లను ఇక పరిగణలోకి తీసుకోరు. గతంలో తరహాలో పది ఉమ్మడి జిల్లాలు, రెండు జోన్ల వారీగా నియామకాలు చేసే అవకాశం మాత్రమే ఉండనుంది. దీనిపై కూడా పూర్తిస్థాయిలో సాధ్యాసాధ్యాలను అధ్యాయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం కొత్తగా మళ్లీ జీవో విడుదల చేయాల్సిన అవసరం ఉంటోంది. రాష్ట్రాన్ని పాత జిల్లాల తరహాలోనే గుర్తిస్తున్నట్లు జీవో తీసి, దాని ద్వారా నియామకాలు చేయాల్సి ఉంటోంది. కానీ దీనిపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ ఇలా చేస్తే తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులను కూడా ముందుగానే విశ్లేషించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed