మీరు పంపకుంటే.. ఆ దేశం నుంచి కొనుక్కుంటాం.. అనుమతివ్వండి

by vinod kumar |
jharkhand cm hemant soren
X

రాంచీ: కరోనా వైరస్ వ్యాప్తితో పాజిటివ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం.. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఔషధాలను పంపకపోవడంతో రాష్ట్రాలు మరో దారిని వెతుక్కుంటున్నాయి. ‘మీరు (కేంద్ర ప్రభుత్వం) పంపకుంటే పాయే..! మాకు కొనుక్కోవడానికైనా అవకాశం ఇవ్వండి మహాప్రభో..’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ నిల్వలు అడుగంటడం.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో దానికి డిమాండ్ ఎక్కువవడంతో వాటిని పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి కొనుగోలు చేస్తామని కేంద్రానికి లేఖ రాశారు. అందుకు తమకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు.

హేమంత్ సోరెన్ స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో రెమిడెసివిర్ మందుల కొరత ఉంది. వాటికున్న డిమాండ్ దృష్ట్యా దానిని ఉత్పత్తి చేసే పలు బంగ్లాదేశ్ కంపెనీలను మేం సంప్రదించుతున్నాం. అత్యవసర అవసరం కింద 50 వేల వయల్స్ (బుడ్డీలు) కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం వీలైనంత త్వరగా అనుమతులివ్వండి..’ అంటూ కేంద్ర మంత్రి సదానంద గౌడను కోరారు. కరోనా సోకినవారు సీరియస్ గా ఉన్నప్పుడు వారికి అందించే దివ్యౌషధంగా రెమిడెసివిర్‌కు డిమాండ్ ఉంది. కానీ దేశవ్యాప్తంగా దాని కొరత రాష్ట్రాలను వేధిస్తున్నది. దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాలకు రెమిడెసివిర్‌లను ఎగుమతి చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed