ఇషాన్ కిషన్ వీరంగం.. హజారే ట్రోఫిలో మెరుపు సెంచరీ

by Shyam |
Ishan Kishan
X

దిశ, స్పోర్ట్స్: యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మాన్ ఇషాన్ కిషన్ ఆటను ఎవరూ మర్చిపోతేరు. గత సీజన్‌లో ముంబయి జట్టు ఐపీఎల్ చాంపియన్ కావడంలో ఇషాన్ కిషన్ పాత్ర కూడా కీలకమే. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జార్ఖండ్ కుర్రాడు తుఫానులా రెచ్చిపోయాడు. కేవలం 94 బంతుల్లో 173 పరుగులు చేశాడు. తొలి అర్ద సెంచరీ 42 బంతుల్లో చేసిన కిషన్.. తర్వాత 32 బంతుల్లో 50 చేసి సెంచరీ నమోదు చేశాడు.

ఆ తర్వాత అర్ద సెంచరీ కేవలం 12 బంతుల్లో చేసి 150 పరుగుల మైలు రాయి దాటాడు. ఈ క్రమంలో డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ ద్విశతకానికి 27 పరుగుల దూరం వద్ద అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ (173)తో పాటు విరాట్ సింగ్ (68), సుమిత్ కుమార్ (52) అనుకూల్ రాయ్ (72) కూడా జత కలవడంతో జార్ఖండ్ జట్టు 50 ఓవర్లలో 422 పరుగులు చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రంలో ఇదే అత్యధిక స్కోరు. ఇక 423 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు కేవలం 98 పరుగులకే ఆలౌట్ కావడంతో జార్ఖండ్ 324 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed