జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ ఏపీ బ్యూరో: పొగడ్త అయినా తెగడ్త అయినా ముక్కుసూటిగా మొహం మీదే మాట్లాడడం టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి నైజమంటూ రాజకీయ వర్గాల్లో పేరుంది. జేసీ ఏది మాట్లాడినా వివాదమే.. ఎందుకంటే ఆయన నేరుగానే విమర్శలు చేస్తారు. అలాంటి జేసీ విద్యుత్ ఛార్జీలపై సొంత పార్టీ నేతలు చేపట్టిన నిరసనపై.. అసలు మావాళ్లు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు (సీఎం జగన్) లెక్కచేయడం లేదన్నారు. ఏకంగా హైకోర్టు ఆదేశాలతో పక్కన బెడుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్‌కి అంతా గజగజ వణుకుతారని జేసీ చెప్పారు. అమరావతి రాజధాని కోసం అక్కడి ప్రజలు 158 రోజులుగా దీక్ష చేస్తున్నా జగన్ కనీసం పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. జగన్ తప్పు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ, మా పార్టీవాళ్లు ఎందుకు దీక్షలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేతనైతే ఆయన ఇంటిముందు ఉవ్వెత్తున కూర్చోవాలి. అప్పుడు ఆయన స్పందిస్తారన్నారు.

ఈ రోజుల్లో నిజంగా దీక్ష చేసినా ప్రజలు నమ్మరని జేసీ స్పష్టం చేశారు. బిర్యానీ తిని దీక్ష చేస్తున్నారని అనుకుంటారన్నారు. అందుకే కొడితే 32 పండ్లు రాలేలా కొట్టాలి. లేదంటే దాని జోలికి పోకూడదని ఆయన సలహా ఇచ్చారు. జగన్ ఈ జిందాబాద్, ముర్దాబాద్‌లను పట్టించుకోరని జేసీ క్లారిటీ ఇచ్చారు. కనీసం రాష్ట్రంలో సగం జనాభా ఆయన ఇంటి ముందు కూర్చుంటే వింటాడో లేదో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపుపై ఆయన స్పందిస్తూ, నీళ్ల విషయంలో అన్నదమ్ములు అయినా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారని అన్నారు. ఒకరి తల ఒకరు నరుకేందుకు కూడా వెనకాడరని చెప్పారు. పోతిరెడ్డిపాడు విషయంలో మా వాడు (జగన్) చాలా సిన్సియర్‌ గానే ఉన్నారనిపిస్తోందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed