ఉడెన్ శాటిలైట్‌తో ‘అంతరిక్ష వ్యర్థాల’కు చెక్

by Shyam |   ( Updated:2020-12-30 06:42:39.0  )
ఉడెన్ శాటిలైట్‌తో ‘అంతరిక్ష వ్యర్థాల’కు చెక్
X

దిశ, వెబ్ డెస్క్: అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, అంతకు రెట్టింపు స్థాయిలో స్పేస్ జంక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్స్‌తో పాటు అవి ఢీకొన‌డం వ‌ల్ల ఏర్పడిన ఉపగ్రహ శకలాలు, రాకెట్లకు సంబంధించిన జంక్.. అంతా కూడా అంత‌రిక్షంలోనే ఉండిపోతున్నాయి. స్పేస్‌లో సుమారు 30 వేల సంఖ్యలో భారీ సైజు వ్యర్థాల ముక్కలుండగా, ఒక మిల్లీమీట‌ర్ క‌న్నా పెద్ద సైజున్న వ్యర్థాలు సుమారు 128 మిలియ‌న్లు ఉన్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవలే పేర్కొంది. గంటకు 22,300 మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ అంతరిక్ష వ్యర్థాలు గనుక ఉపగ్రహాలను తాకితే తీవ్ర నష్ట వాటిల్లుతుందన్నది తెలిసిందే. అయితే భూమి చుట్టూ సుమారు 6000 ఉపగ్రహాలు తిరుగుతుండగా, అందులో 60 శాతం ఉపయోగంలో లేనివని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే జపాన్‌కు చెందిన సుమిటోమో సంస్థ.. స్పేస్ జంక్ సమస్యకు పరిష్కారంగా క్యోటో యూనివర్సిటీతో కలిసి కలపతో ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా 2023 వరకు సదరు ఉడెన్ శాటిలైట్స్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

అంతరిక్ష వ్యర్థాలను తగ్గించేందుకు, తొలగించేందుకు అంతరిక్షరంగ నిపుణులు, పరిశోధకులు పలు మార్గాలను అన్వేషిస్తూ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన సుమిటోమో ఫారెస్ట్రీ అనే కంపెనీ, క్యోటో యూనివర్సిటీతో కలిసి ‘ఉడెన్ శాటిలైట్స్’ రూపొందించే క్రమంలో ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అంతరిక్షంలో కలప వాడకం, వృక్షాల పెరుగుదలపై పరిశోధనలు సాగిస్తోంది. కలపతో చేసిన ఉపగ్రహాలు వాతావరణంలోకి హానికారక పదార్థాలను విడుదల చేయకుండా, తిరిగి భూమిని చేరుకునేటప్పుడు వ్యర్థాలను విడిచిపెట్టకుండా స్పేస్‌లోనే దగ్ధమయ్యే విధంగా వీటిని రూపొందిస్తున్నారు. అందుకోసం భూమిపై వివిధ ఉష్ణోగ్రతల్లో పెరిగే పలు రకాల కలపతో వీరు పరిశోధనలు సాగిస్తున్నారు. అన్ని రకాల ఉష్ణోగ్రతలను, పరిస్థితులను తట్టుకునే విధంగా ఉంటూనే.. ఉపగ్రహ తయారీకి కావాల్సిన కలపను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని సుమిటోమో ఫారెస్ట్రీ తెలిపింది.

ఉపగ్రహాలు తిరిగి భూమిని చేరేటప్పుడు సూక్ష్మమైన అల్యూమినియం రేణువులను విడుదల చేస్తుంటాయి, అవి కొన్ని సంవత్సరాల పాటు ఎర్త్ అట్మాస్పియర్‌లోనే ఉండిపోవడం వల్ల పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుండటం ఒకింత ఆందోళన కలిగించే అంశమని జపాన్ వ్యోమగామి అండ్ క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ టకావ్ డోయ్ చెప్పారు.

Advertisement

Next Story