స్థిరంగా ఆటో అమ్మకాలు!

by Shyam |
స్థిరంగా ఆటో అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021 ఏడాది మొదటి నెల జనవరిలో ఆటో అమ్మకాలు స్థిరమైన వృద్ధిని సాధించాయి. హ్యూండాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, యమహా, హోండా విక్రయాలు పెరగ్గా, హీరో మోటో కార్ప్ అమ్మకాలు క్షీణించాయి. అలాగే, హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, టీవీఎస్ అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. గతేడాది కరోనా ప్రభావం నుంచి బయటపడిన తర్వాత గడిచిన ఆరు నెలలుగా ఆటో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కాగా, జనవరిలో కార్ల అమ్మకాలు నెలవారీగా 10 శాతం, వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి.

మారుతీ సుజుకి

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ కాంపాక్ట్ సెగ్మెంట్, లైట్ కమర్షియల్ వాహనాల డిమాండ్ ఉన్న నేపథ్యంలో జనవరి అమ్మకాల్లో కంపెనీ మొత్తం 1,60,752 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 1,54,123 యూనిట్లతో పోలిస్తే ఇది 4.3 శాతం వృద్ధి అని కంపెనీ తెలిపింది. దేశీయ అమ్మకాలు 0.2 శాతం పెరిగి 1,42,604 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 29.3 శాతం పెరిగి 12,445 యూనిట్లుగా ఉన్నాయి. ఇక, ప్యాసింజర్ వాహన అమ్మకాలు 6.9 శాతం క్షీణించి 1,03,435 యూనిట్లకు చేరుకున్నాయి.

బజాజ్ ఆటో

బజాజ్ ఆటో జనవరి నెలలో మొత్తం అమ్మకాల్లో 8 శాతం పెరిగాయని తెలిపింది. గతేడాది ఇదే నెలలో 3.94 లక్షల యూనిట్లతో పోలిస్తే 4.25 లక్షల వాహనాలను విక్రయించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దేశీయ అమ్మకాలు 11 శాతం క్షీణించి 1.70 లక్షల యూనిట్లకు తగ్గాయి. ఎగుమతులు 26 శాతం పెరిగి 2.54 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

హీరో మోటోకార్ప్

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమ్మకాలు జనవరిలో 3.13 శాతం పడిపోయాయి. ఈ నెలలో మొత్తం 4.85 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. మోటార్‌సైకిల్ అమ్మకాలు 9 శాతం తగ్గి 4.49 లక్షల యూనిట్లుగా ఉండగా, స్కూటర్ అమ్మకాలు 5 రెట్లు పెరిగి 36,852 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 33 శాతం పెరిగి 18,113 యూనిట్లుగా నమోదయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ అమ్మకాలు జనవరిలో 8 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 68,887 యూనిట్లను విక్రయించగా, గతేడాది ఇదే నెలలో 63,520 యూనిట్లను అమ్ముడుపోయినట్టు కంపెనీ పేర్కొంది. ఎగుమతులు రెట్టింపు స్థాయిలో 4,515 యూనిట్లకు చేరుకున్నాయి. 350 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 64,248 యూనిట్లకు చేరుకున్నాయి. 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోడళ్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 4,639 యూనిట్లుగా నమోదయ్యాయి.

టాటా మోటార్స్

టాటా మోటార్స్ లిమిటెడ్ దేశీయ అమ్మకాల్లో వార్షిక ప్రాతిపదికన 28 శతం వృద్ధిని సాధించింది. వాణిజ్య వాహనాల డిమాండ్ కారణంగానే అమ్మకాల వృద్ధి నమోదైనట్టు కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 45,242 యూనిట్లను విక్రయించగా, ఈ జనవరిలో 57,742 యూనిట్లకు చేరుకున్నాయి. కార్ల అమ్మకాలు రెట్టింపు వృద్ధితో 26,978 యూనిట్లు అమ్ముడయ్యాయి. కమర్షియల్ వాహనాల ఎగుమతులు 15 శాతం తగ్గి 2,142 యూనిట్లుగా నమోదయ్యాయి.

టీవీఎస్ మోటార్స్

దేశీయ దిగ్గజ టూ-వీలర్ అమ్మకాలు జనవరిలో 31 శాతం పెరిగాయి. గతేడాది 2,34,920 యూనిట్లను విక్రయించగా, ఈసారి 3,07,149 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ అమ్మకాలు 1,63,007 యూనిట్ల నుంచి 2,05,2016 యూనిట్లకు పెరిగాయి. మొత్తం ఎగుమతులు 43 శాతం పెరిగి 1,36,970 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ అమ్మకాలు 13.3 శాతం పడిపోయాయి.

హ్యూండాయ్ మోటార్ ఇండియా

జనవరిలో హ్యూండాయ్ అమ్మకాలు 15.6 శాతం పెరిగి 60,105 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ అమ్మకాలు 23.8 శాతం పెరిగి 52,005 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 19 శాతం తగ్గి 8,100 యూనిట్లుగా నమోదయ్యాయి.

అశోక్ లేలండ్..

అశోక్ లేలండ్ మొత్తం అమ్మకాలు 11 శాతం పెరిగి 13,126 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మీడియం, భారీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు గతేడాది 6,949 యూనిట్ల నుంచి 2 శాతం తగ్గి 6,839 యూనిట్లకు చేరుకున్నాయి.లైట్-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 42 శాతం పెరిగి 5,520 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 23.3 శాతం తగ్గి 767 యూనిట్లుగా నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed