జన్‌ధన్‌ ఖాతాల్లో 16 కోట్లు వెనక్కి..

by Shyam |
జన్‌ధన్‌ ఖాతాల్లో 16 కోట్లు వెనక్కి..
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్‌ధన్‌ ఖాతాలకు కరోనా ప్రత్యేక సాయం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా జమచేసిన రూ.16కోట్లకు పైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) వెనక్కి తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జన్‌ధన్‌ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యాంకు ఖాతాల్లో ఈనెల మొదటివారంలో దేశవ్యాప్తంగా నగదు జమ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.500 జమయ్యాయి. అయితే, వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది.

ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ.16కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్‌ తెలిపారు. 1 ఆగస్ట్‌, 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద జరిగిన పొరపాటు వల్లే నగదును అనర్హులకు జమచేశామనీ, వారంరోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం వివరించారు. అనర్హుల్లో ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారనీ, వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Tags : jandhan account, garib kalyan yojana, telangana gramina bank,money, pulled back

Advertisement

Next Story