వినతిపత్రం ఇస్తామంటే అరెస్ట్ చేస్తారా?- నాదెండ్ల మనోహర్

by srinivas |   ( Updated:2021-07-20 07:41:45.0  )
janasena leader
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను వంచించారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10వేల పోస్టులకే జాబ్ క్యాలెండర్ ఇచ్చిందని మండిపడ్డారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల్లో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాలను ఇవ్వడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల్లో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాల ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు.

వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తున్న తమ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి, గృహనిర్బంధాలు చేయడం, కొన్నిచోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటివి చేశారని ఇది సరైనది కాదన్నారు. వినతిపత్రాలు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో ఒక హక్కు అని, దాన్ని అడ్డుకోవడం నియంతృత్వ పోకడ అవుతుందన్నారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించినా జనసేన పార్టీ మాత్రం నిరుద్యోగులకు అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed