పశ్చిమగోదావరిలో జనసేనకు షాక్..వైసీపీ గూటికి కీలక నేత..

by srinivas |
పశ్చిమగోదావరిలో జనసేనకు షాక్..వైసీపీ గూటికి కీలక నేత..
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. పాలకొల్లు జనసేన నేత గుణ్ణం నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నాగబాబుతో పాటు ఆయన సోదరుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావుల‌ు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్ ఉన్నారు. ఇకపోతే ఈనెల 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉంది. ఇలాంటి తరుణంలో గుణ్ణం నాగబాబు వైసీపీలో చేరడం ఆ పార్టీ కార్యకర్తలను కాస్త నిరుత్సాహానికి గురిచేసినట్లైంది. 2019 ఎన్నికల ముందు వరకు పాలకొల్లు వైసీపీ ఇన్‌చార్జిగా నాగబాబు ఉన్నారు.

అయితే పాలకొల్లు అసెంబ్లీ సీటు దక్కకపోవడంతో 2019లో జనసేనలో చేరారు. ప్రస్తుతం తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. నాగబాబుకు పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కవురు శ్రీనివాస్‌ జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన స్థానంలో నాగబాబును నియమిస్తారని ప్రచారం జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed