కోర్టు నుంచి తప్పించుకునేందుకే ఈ నిర్ణయం : పవన్ కల్యాణ్

by Anukaran |
pawan kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. హైకోర్టు నుంచి తప్పించుకునేందుకే జగన్ సర్కార్ హడావిడి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. జగన్ మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రాజధాని అమరావతికి సంబంధించి 57 కేసుల్లో చురుకుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ఉపక్రమించిందని భావిస్తున్నట్లు తెలిపారు.

‘జగన్ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నరేళ్లు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకువచ్చారు. వికేంద్రీకరణ అంటూ చిలకపలుకులు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారు. మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగితేలుతున్నారు. రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్ తాను ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అమరావతి ఉద్యమంలో ఉన్న ఎస్సీలపై ఎస్సీలతోనే ఫిర్యాదులు చేయించి అట్రాసిటీ కేసులు బనాయించి వికృత చర్యలకు పాల్పడ్డారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలబడగా.. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోంది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుంది’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed