2022లోనే జమిలి ఎన్నికలు!

by Anukaran |
2022లోనే జమిలి ఎన్నికలు!
X

జమిలి ఎన్నికల గురించి జాతీయస్థాయిలో సీరియస్ చర్చే జరుగుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీలలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోక తప్పదని సీఈసీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొద్ది రోజుల క్రితం జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జమిలి ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించాయి. ఏయే పార్టీలు అనుకూలంగా ఉన్నాయో తేటతెల్లమైంది. ఒకవేళ జమిలి ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని ఎలా ఖరారు చేయాలనేదాని మీద సందేహాలున్నాయి. కొన్నిచోట్ల మధ్యంతరంగా అసెంబ్లీని ముగించాల్సి వస్తుంది. మరికొన్నిచోట్ల గడువును పొడిగించాల్సి ఉంటుంది. ఇలాంటి లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో ఎలాంటి సవరణ చేయాలన్నదానిపై కూడా కసరత్తు జరిగింది. నీతి ఆయోగ్ అనేక కోణాల నుంచి ఆలోచించి నివేదికను రూపొందించింది. లా కమిషన్, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేశాయి. రాజ్యాంగం నుంచి వచ్చే చిక్కులపై ఆటార్నీ జనరల్ నుంచి అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

హస్తిన నుంచి హైదరాబాద్ దాకా

ప్రధాని నుంచి వచ్చిన జమిలి ఎన్నికల ప్రస్తావన టీఆర్ఎస్‌లోనూ చర్చకు దారితీసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఒక సందర్భంలో కార్యకర్తల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ కాలపరిమితి 2023 చివరి వరకూ ఉన్నా ఒక సంవత్సరం ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వివరించారు. జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ గతంలోనే సానుకూల స్పందనను తెలియజేసింది. ఇప్పుడు వాటిని ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది. 2022 ద్వితీయార్ధంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంటుతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని చెబుతున్నారు. దీని ప్రకారం తెలంగాణలో 2022లో జూలై తర్వాత ఎన్నికల హడావుడి మొదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే తగిన వ్యూహంతో సిద్ధం కావడం ఆ పార్టీకి అనివార్యమైంది. షెడ్యూలుకంటే ఏడాదిన్నర ముందే పార్టీ శ్రేణులను సిద్దం చేయాల్సి వస్తోంది. మరో ఏడాదిన్నర సమయం ఉన్నందున ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందించడంపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుకోవడంతోపాటు బలమైన ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుంటోంది.

ప్రక్షాళన తప్పదా?

జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీపరంగా, పాలనాపరంగా భారీస్థాయిలోనే ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ వర్గాలు అలాంటి సంకేతాలను లీక్ చేశాయి. పార్టీ నాయకత్వంలో మార్పులు తప్పవని పేర్కొన్నాయి. ప్రభుత్వపరంగా మంత్రుల మార్పు, పాలనలోనూ మార్పు అనివార్యమన్న వాతావరణం నెలకొంది. పార్టీపరంగా మాత్రమేకాక, పాలనాపరంగా కూడా దూకుడు నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు చేరువకావడం, సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరడం, హామీలను త్వరితగతిన అమలుచేయడం, అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం.. ఇలా అనేక అంశాలలో పార్టీ నాయకత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలకు అనుగుణంగా సరికొత్త వ్యూహంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గెలవడం ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. వరుస గెలుపులతో ప్రజాదరణను పటిష్టంగా ఉంచుకోవాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. సోషల్ మీడియాకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story