దుబాయి ఆస్పత్రిలో పేషెంట్.. రూ. 3.40 కోట్ల బిల్లు మాఫీ

by Anukaran |
దుబాయి ఆస్పత్రిలో పేషెంట్.. రూ. 3.40 కోట్ల బిల్లు మాఫీ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దేశం కాని దేశంలో అనారోగ్యానికి గురైన వలస పక్షిని క్షేమంగా సొంత రాష్ట్రానికి చేర్చడంతో పాటు భారీ బిల్లును మాఫీ చేయించడంలో సక్సెస్ అయ్యారు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితీ బాధ్యులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వలస బిడ్డకు బాసటగా నిలిచిన బాధ్యులకు దుబాయిలోని ఇండియన్ కాన్సూలెట్ అధికారుల సహకారం కూడా చేదోడుగా నిలిచింది. దీంతో వారి శ్రమ ఫలించింది.

సంఘటనా వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి దుబాయిలో గత డిసెంబర్ 25న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. గంగారెడ్డిని పరీక్షించిన డాక్టర్లు పక్షవాతానికి గురయ్యాడని తేల్చారు. ఈ మేరకు చికిత్స చేస్తున్న వైద్యులు బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయాల్సి ఉందని నిర్ధారించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమించి కోమాలోకి వెళ్ళాడు. ఆరు నెలలు కోమాలో ఉన్న గంగారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. 9 నెలలలుగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగారెడ్డిని స్వదేశానికి రప్పించాలని అతని కొడుకు మణికంఠ, స్నేహితుడు ఇబ్రహీంలు దుబాయి గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండల్లి నర్సింహను సంప్రదించారు. విషయం తెలుసుకున్న నర్సింహ గంగారెడ్డికి చికిత్స అందిస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అలాగే దుబాయి హస్పిటల్ అధికారులు, పొలీసు అధికారులతో సంప్రదింపులు జరిపి దుబాయిలోని కాన్సూలెట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులకు పరిస్థితిని వివరించారు. గంగారెడ్డి ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని అతన్ని ఎలాగైనా ఇండియా పంపించాలని వేడుకున్నారు. అలాగే 9 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినందుకు రూ. 3.40 కోట్లు మాఫీ చేయించాలని నర్సింహ కోరారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు చొరవ తీసుకోవడంతో ఆసుపత్రి బిల్లు మాఫీ కావడంతో పాటు గంగారెడ్డిని ఇండియాకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ మేరకు ఇండియన్ కాన్సూలేట్ అధికారులు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సు ఏర్పాటు చేయడంతో పాటు గంగారెడ్డికి వైద్య సేవలందించేందుకు నర్సును కూడా పంపించారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న గంగారెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దుబాయిలోని మెడిక్లినిక్ సిటీ హాస్పిటల్ నుండి నిమ్స్ హాస్పిటల్ వరకు ఎయిర్ అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇందుకు అదనంగా అయిన రూ. 4.40 లక్షలు కూడా కాన్సూలెట్అధికారులే సమకూర్చడం విశేషం. గంగారెడ్డి చికిత్స కోసం అయిన బిల్లు మాఫీ చేయించడంతో పాటు అతన్ని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించేందుకు సహకరించిన దుబాయి కాన్సూలెట్ అధికారులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

Advertisement

Next Story

Most Viewed