రేవంత్, హారీష్‌తో వైరం.. కేటీఆర్‌తో దోస్తీ.. జగ్గారెడ్డి వ్యూహమేంటి..?

by Anukaran |   ( Updated:2021-12-17 00:35:14.0  )
రేవంత్, హారీష్‌తో వైరం.. కేటీఆర్‌తో దోస్తీ.. జగ్గారెడ్డి వ్యూహమేంటి..?
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అధికార టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నది. టీఆర్‌ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​కల్వకుంట్ల తారకరామారావుతో జగ్గారెడ్డి క్లోజ్‌గా ఉంటున్నారని గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతున్నది. ఆ చర్చలకు ఆజ్యం పోసినట్లుగానే గురువారం సంగారెడ్డి జిల్లాలో కేటీఆర్​పర్యటనలో ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. గుసగుసలాడుకున్నారు. మా ఎమ్మెల్యేలను బాగా చూసుకోవాలని కేటీఆరే జగ్గారెడ్డితో అంటే.. మీరు మంత్రి మీరే మమ్మల్ని చూసుకోవాలంటూ జగ్గారెడ్డి అనడంతో, అక్కడే ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఏం జరుగుతుందో తెలియక తెల్లముఖం వేశారు.

రాజకీయ ఆరోపణల విషయంలో జగ్గారెడ్డి ఎప్పుడు కూడా కేటీఆర్‌ను విమర్శించరు. కేవలం మంత్రి హరీష్​రావు‌ను టార్గెట్​చేసి జగ్గారెడ్డి ఆరోపణలు చేస్తుంటారు. జిల్లా మంత్రి అయినప్పటికీ కేటీఆర్ సంగారెడ్డి పర్యటనలో హరీష్​రావు కనిపించకపోవడం మరింత చర్చకు దారితీసింది. మంత్రి హరీష్​రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిని కూడా జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. అలాంటిది తమ సమక్షంలోనే కేటీఆర్‌తో జగ్గారెడ్డి క్లోజ్‌గా ఉండడాన్ని హరీష్​రావుతో పాటు ఎంపీ ప్రభాకర్ సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. హరీష్​ టార్గెట్‌ గానే గత కొంత కాలంగా జగ్గారెడ్డిని ప్రత్యేకంగా కేటీఆర్​ప్రోత్సహిస్తున్నారని ట్రబుల్ షూటర్ సన్నిహితులు ఆగ్రహంతో ఉన్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జగ్గారెడ్డి హరీష్​రావును టార్గెట్​ చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు 230 ఓట్లు రాకపోతే రాజీనామా చేస్తానని సవాల్​కూడా చేసి అనుకున్న వాటికంటే ఎక్కువే ఓట్లు తెచ్చుకుని తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇదిలా ఉండగా అసలు కేటీఆర్​పర్యటన సందర్భంగా హరీష్​రావు ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో హరీష్​ ప్రాధాన్యత తగ్గించే లక్ష్యంతో వేగంగా కుట్రలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్​శ్రేణులు ఆరోపిస్తున్నాయి. హరీష్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జగ్గారెడ్డి.. కేటీఆర్​ప్రోగ్రాంలో ఉత్సాహంగా కనిపించడం ఈ ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నది. స్థానిక ఎమ్మెల్యేగా ప్రోగ్రాంకి వచ్చానని చెప్పుకున్న జగ్గారెడ్డి మిగతా కార్యక్రమాలకు మాత్రం రావడం లేదు.

సంగారెడ్డిలో గులాబీ ఆదరణ తగ్గడంతోనే..

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ సంగారెడ్డి నియోజకర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఇక్కడ జగ్గారెడ్డి హవా కొనసాగుతున్నది. మంత్రి హరీష్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లు స్థానికంగా ఎంత తిరుగుతున్నా జగ్గారెడ్డి చరిష్మా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ జగ్గారెడ్డి మంచి లీడర్ అనే అభిప్రాయం కేటీఆర్‌కు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో కొంత కాలం హరీష్​రావు‌కు మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దూరం పెట్టినప్పుడే జగ్గారెడ్డి.. కేటీఆర్‌కు దగ్గర అయ్యారని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌ను కొనియాడుతూ కేవలం హరీష్​రావును మాత్రమే జగ్గారెడ్డి టార్గెట్​చేయడంలో ఆంతర్యమేమిటని హరీష్​సన్నిహితులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ పీసీసీ చీఫ్‌తో పాటు అప్పుడప్పుడు పార్టీ తీరుపై జగ్గారెడ్డి ఆరోపణలు చేయడంలో కూడా కేటీఆర్​వ్యూహం ఉన్నదని కాంగ్రెస్​వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నది. మొత్తంగా సంగారెడ్డి ఎమ్మెల్యే వ్యవహారం అటు టీఆర్ఎస్, మరో వైపు కాంగ్రెస్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed