సీఎం జగన్ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నారు: రామకృష్ణ

by srinivas |
సీఎం జగన్ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నారు: రామకృష్ణ
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద సీపీఐ దీక్షలకు పూనుకుంది. ఈ దీక్షలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం సుదీర్ఘమైన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. రాజధాని మార్పుపై విచారణ జరిపే హైకోర్టు బెంచ్‌లో న్యాయమూర్తులను మార్చమనడం దిగజారుడుతనమే. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేదు. సీఎం జగన్ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పోటీ పాదయాత్రలకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు అంటూ రామకృష్ణ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంది.

ఈ వైఖరిని సీపీఐ ఖండిస్తుంది. బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొనాలని అమిత్ షా చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ డ్రామాలు మానుకోవాలి. పీఎం మోడీ, హోంమంత్రి అమిత్ షా రాజధాని మార్చవద్దని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సలహా ఇవ్వొచ్చు కదా.. అలా కాకుండా పాదయాత్రకు సంఘీభావం తెలపండి అని చెప్పడం ఇదొక పొలిటికల్ డ్రామా’ అని రామకృష్ణ కొట్టి పారేశారు. అలా కాకుండా మోడీ, షాలు రాజధానిగా అమరావతినే ఉంచాలని సీఎం జగన్‌కు సలహా ఇస్తే అప్పుడు మాత్రమే ప్రజలు బీజేపీని నమ్ముతారని లేదంటే నమ్మరని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story