అమ్మ జన్మనిస్తే..జగనన్న జీవితానిచ్చాడు.. ఎమ్మెల్యే రోజా భావోద్వేగం

by srinivas |
roja
X

దిశ, ఏపీ బ్యూరో: అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా.. జగనన్నకు సాటిరారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం ఏ రాష్ట్రప్రభుత్వం అమలు చేయని అనేక పథకాలను వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చారని కొనియాడారు.

అంతేకాదు మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పుకొచ్చారు. అమ్మఒడి పథకం దేశంలోనే గొప్ప పథకమని అన్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మహిళల తలరాతను మార్చేలా జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొనియాడారు. 65 శాతం మంది మహిళలకు మున్సిపల్‌​ చైర్మన్ల పదవులు, ఎంపీపీ పదవుల్లో 53 శాతం మహిళలకే కేటాయించిన విషయాన్ని రోజా గుర్తు చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజా సెటైర్లు వేశారు. చం‍ద్రబాబు మహిళా ద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కుప్పంలో చం‍ద్రబాబును ప్రజలు ఛీకొట్టారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆడవాళ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని రోజా గుర్తు చేశారు. కుప్పంలో చంద్రబాబు, లోకేశ్‌లు వీధి రౌడీల్లాగా వ్యవహరించారని, గల్లీ గల్లీ తిరిగినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్‌కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed