సాగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా: జగదీశ్ రెడ్డి

by Shyam |
సాగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా: జగదీశ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ పాలనలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల విభాగానికి జరుగుతున్న ఎన్నికలను పురస్కరించుకుని మంగళవారం నాగార్జునసాగర్, హాలియా, నిడమనూరులలో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… నాగార్జునసాగర్ నియోజకవర్గం, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కూడా తాము బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు.

60 ఏండ్ల పాలనతో ఆరు ఏండ్ల పాలనను పోల్చుకునే చర్చకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అందుకు కాంగ్రెస్ సిద్ధమేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో జిల్లాను ఫ్లోరిన్ మయం చేసిందన్నారు. కానీ కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ దూర దృష్టితో తీసుకున్న మిషన్ భగీరథ నిర్ణయంతో జిల్లాలో ఫ్లోరిన్ భూతాన్ని మటుమాయం చేసింది నిజం కాదా అని నిలదీశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అంట గట్టేందుకే కేంద్రం వ్యవసాయ చట్టాల్లో సవరణ చేసిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed