రెండు శాఖలను కలపొద్దు…. మంత్రి సత్యవతిని కోరిన అధికారులు

by Shyam |   ( Updated:2021-11-23 08:17:40.0  )
Minister Satyavathi Rathod
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలను కలపొద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దివ్యను కలిసిన జేఏసీ నాయకులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. గత ఐదేళ్లుగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులే దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖలో పనిచేస్తున్నామని తెలిపారు.

దీంతో పనిభారంతో పాటు ప్రమోషన్స్ విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దివ్యాంగుల శాఖలో సూపరింటెండెంట్ ప్రమోషన్‌పై అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి వెళ్తుంటే.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సూపరింటెండెంట్ నుంచి సీడీపీవో సూపర్‌వైజర్‌గా పదోన్నతి పొందుతున్నారు. అయితే, సూపర్‌వైజర్ పోస్టు అసిస్టెంట్ డైరెక్టర్ కంటే తక్కువ. ఇలా ఒకే శాఖకి చెందిన ఉద్యోగులు ప్రమోషన్ల విషయమై ఈర్శా్ద్వేశాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఈ రెండు శాఖలను అన్ని స్థాయిల్లో డీమర్జ్ చేయాలని కోరారు.

అలా కుదరకపోతే ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై త్వరితగతిన ఓ నిర్ణయం తీసుకొని సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు పున్నారెడ్డి, జనరల్ సెక్రటరీ జ్యోతి పద్మ, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి, సునంద, జాక్ కో చైర్మన్ జయరాం నాయక్, రమణ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed