మొక్కలు నాటిన కమెడియన్స్

by Shyam |   ( Updated:2020-07-15 06:16:28.0  )
మొక్కలు నాటిన కమెడియన్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ఉద్యమంలా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అంతరించిపోతున్న అటవిని పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాన్ని కూడా చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగు హీరోలకు ఛాలెంజ్ విసిరి, ప్రభాస్, శర్వానంద్‌లతో మొక్కలు నాటించారు. ఇందులో భాగంగా జబర్ధస్త్ కమెడియన్స్ గచ్చిబౌళిలోని ప్రభుత్వ పాఠశాల ప్రారంగణంలో మొక్కలు నాటారు. ఈరోజు గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో జబర్దస్త్ టీం సభ్యులైన అదిరే అభి, కెవ్వు కార్తిక్, పొట్టి నరేష్, అప్పారావు, శ్రీమతి లక్ష్మి అప్పారావు, రాజమౌళి కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం అదిరే అభి మాట్లాడుతూ.. మొక్కలు పెంచడం మనందరి బాధ్యత అని, మొక్కలు లేనిదే మానవాళి లేదన్నారు. భోజనం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు, నీరు లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమని తెలిపారు. రోజురోజుకూ వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దీన్ని నివారించాలంటే మనందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని తన టీమ్ మెంబర్స్‌తో కలిసి సందేశం ఇచ్చారు. మొక్కలు నాటిన తర్వాత కార్తీక్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా మనందరము ముక్కులకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాము అని రాబోయే రోజుల్లో మనం మొక్కలు పెంచడాన్ని నిర్లక్ష్యం చేస్తే వాతావరణ కాలుష్యం పెరిగి ప్రతిఒక్కరూ మన వీపున ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఒక ఉద్యమంలో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి వారి మిత్రబృందానికి పొట్టి నరేష్‌తో పాటు మిగతా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ కృతజ్ఞతలు తెలియజేసాడు.

Advertisement

Next Story