హిమానీ నదాలకు కొత్త వస్త్రాలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-14 02:08:42.0  )
himani-nadalu
X

దిశ, ఫీచర్స్ : ‘గ్లోబల్ వార్మింగ్’ జీవకోటికి పెనుముప్పులా పరిణమిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇటీవల వచ్చిన జలప్రళయమే అందుకు నిదర్శనం కాగా అంటార్కిటికాలోని ‘అమెరీ ఐస్ షెల్ఫ్ సరస్సు’ కేవలం మూడు రోజుల్లో కనిపించకుండా పోవడం వాతావరణ శాస్త్రజ్ఞులను కలవరానికి గురి చేసిన విషయం తెలిసిందే. నిత్యం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో ఏటా 15 వేల కోట్ల టన్నులు, గ్రీన్‌ల్యాండ్‌లో 27,800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే వేడివల్ల వేగంగా కరిగిపోతున్న ఉత్తర​ ఇటలీలోని ప్రెసేనా హిమానీనదాన్ని కాపాడటానికి పొడవాటి వస్త్రాల(టార్ప్)తో కప్పుతున్నారు.

చలిగా ఉంటే స్వెటర్ వేసుకుంటాం. ఇంకా చలివేస్తే దుప్పటి కప్పుకుంటాం. ఇందుకు భిన్నంగా సూర్యకిరణాలు మంచును కరిగించకుండా ఉండేందుకు ఇటలీ వాతావరణ శాస్త్రవేత్తలు మంచుతెరలపై క్లాత్స్ కప్పుతున్నారు. ఇలా చేయడం వల్ల సూర్యకిరణాలు మంచుపై నేరుగా పడకుండా ఉండటంతో, మంచు కరగడాన్ని కొంతలోకొంతైనా నిరోధించవచ్చని వాళ్లు భావిస్తున్నారు. 1993 నుంచి ఇప్పటివరకు ప్రెసెనా హిమానీనదం మూడింట ఒక వంతుకు పైగా మంచును కోల్పోయింది. ప్రస్తుతం ఇది 120,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ నుంచి దీన్ని కాపాడుకోవడానికి పరిశోధకులు ఈ చర్యలు చేపట్టారు. గ్లేసియర్ మొత్తాన్ని వస్త్రాలతో కప్పేయడానికి దాదాపు నెల సమయం పడుతుంది. హిమానీనదం మరింత కుచించుకుపోకుండా ఉండటానికి 2008 నుంచి ప్రతి ఏటా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఈ పద్దతి ద్వారా వేసవిలో 70 శాతం మంచును కరగకుండా కాపాడుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మంచుపై కప్పిన టార్ప్‌పై ఇసుక మూటలను ఉంచుతారు. దీనివల్ల వేడిగాలులు కూడా లోపలికి వెళ్లకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు.

అంటార్కిటికాలోని త్వైట్స్, పైన్ ఐలాండ్ హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం, వేగంగా కరుగుతున్న త్వైట్స్ హిమానీనదం ఇప్పటికే సముద్ర మట్టాల పెరుగుదలకు నాలుగు శాతం దోహదం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, యూఎస్, కెనడాలో రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్ కూడా ఒక శతాబ్దంలో అతిపెద్ద హిమానీనద కరుగుదలకు కారణమైందని నివేదించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్‌లాండ్ హిమానీనదాల ఉపరితలం 750 చదరపు కిలోమీటర్లు (290 చదరపు మైళ్ళు) లేదా ఏడు శాతం కోల్పోయింది. హిమానీనదాలతో కప్పబడిన భూమి 1890 నుంచి ఇప్పటివరకు దాదాపు 2,200 చదరపు కిలోమీటర్లు లేదా 18 శాతం తగ్గింది. ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, నిపుణులు హిమానీనదాలు 2200 నాటికి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇక హిమాల‌య‌న్ కార‌కోరంలో న‌దుల ప‌రిస్థితిపై ఐఐటీ ఇండోర్ టీమ్ చేసిన అధ్యయనంలో సింధు, గంగ‌, బ్రహ్మపుత్ర న‌దుల్లో నీటి మ‌ట్టం రానున్న ద‌శాబ్దాల్లో భారీగా పెర‌గ‌నుంది. ఫ‌లితంగా ఈ న‌దుల దిగువ మైదానాల్లో వ‌చ్చే వ‌ర‌ద‌ల వల్ల కోట్ల మంది జీవితాల‌ు ప్రభావితం కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed