జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది..

by Shyam |
జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన కలం వీరులకు రుణపడి ఉంటామని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. గ్రామీణ ప్రాంత విలేకరులకు, హైదరాబాద్ నగరంలో ఉండే వారికి ఎక్కడ కావాలన్న వారికి అక్కడే ఇంటి స్థలాల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. వేములవాడ ,సిరిసిల్ల జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈరోజు నగరం‌లోని జలవిహార్‌లో మరణించిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రశ్నించాల్సిందే.. మేము వారికి చేయాల్సిందేనన్నారు. మరణించిన 260 మంది జర్నలిస్టు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సహాయం చేశామని, వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదివిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి జర్నలిస్టులకు ఉన్న బంధం పేగుబంధం అని అన్నారు.

టీఆర్ఎస్ ఆవిర్భవించిన నెలరోజుల్లోనే జర్నలిస్టులను ఏకం చేసిన ఉద్యమ నాయకుడు అల్లం నారాయణ అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీకి భవనం త్వరలో సీఎం కేసీఆర్‌తో ప్రారంభమవుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టులకు 100 కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం టీఆర్ఎస్‌దే అన్నారు.

ప్రతిపక్షనేతలు సీఎం కేసీఆర్‌ను బట్టేబాజ్ అనడానికి ఎన్నిగుండెలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తిట్టడం మొదలుపెడితే ఎవరూ తట్టుకోలేరని హెచ్చరించారు. మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ మీడియా అకాడమీ సంక్షేమ నిధి కార్పస్ ఫండ్ మంజూరుకు మరిన్ని నిధులు కేటాయించాలని మంత్రిని కోరిన వెంటనే స్పందించి రూ.17 కోట్ల 50లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మీడియా అకాడమీ కార్యదర్శి మహ్మద్ ముర్తుజా, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి, తదితరులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed