ఆర్నెళ్లు జాగ్రత్తగా ఉండాలంట.. లేకపోతే..

by Anukaran |
ఆర్నెళ్లు జాగ్రత్తగా ఉండాలంట.. లేకపోతే..
X

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్ ప్రభావం దీర్ఘకాలమే ఉంటుంది. పరీక్షల్లో పాజిటివ్.. చికిత్స తర్వాత నెగిటివ్. ఇది ప్రధానం కాదు. వైరస్ తీవ్రత, అది శరీరంలో కలిగించిన నష్టం మీద దృష్టి పెట్టాలి. 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండగానే చికిత్స పూర్తయ్యిందనుకుంటే పొరపాటే. వైరస్ పోతుండొచ్చు. కానీ అది చేసిన గాయం మానే వరకు జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు. కొందరిలో అలసట, ఊపిరాడకపోవడం, మానసిక సమస్యలకు దారి తీస్తోందంటున్నారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఓ సారి పాజిటివ్ వచ్చిన తర్వాత చికిత్స చేయించుకుంటే సరిపోతుంది.. మరోసారి రాదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ చికిత్సకు సంబంధించిన రికార్డులు భద్రం చేసుకోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది. బ్రిటన్ లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం కరోనా వైరస్ నుంచి కోలుకున్న 100 మందిపై అధ్యయనం చేసింది. వారిలో 72 శాతం మందికి ఇతర సమస్యలు వెంటాడుతున్నారని గుర్తించింది.

కాగా, ఊపిరితిత్తులు, గుండెపై కరోనా వైరస్ చేసే నష్టం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. గుజరాత్ లో ఓ పేషెంట్ కరోనా వైరస్ కు చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానని డిశ్చార్జీ అయ్యాడు. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే తీవ్ర గుండెనొప్పి వచ్చి మృతి చెందాడు. ఆయన శరీరంలో వైరస్ పోయింది. కానీ దాని ప్రభావం గుండెపై పడ్డట్లు వైద్యులు చెప్పారు. వైరస్ ప్రభావం అందరిలోనూ ఒకే మాదిరిగా ఉండదు. వయసు, శరీర తత్వం, అప్పటికే నెలకొన్న ఆరోగ్య సమస్యలు వంటివి కొలమానం అవుతున్నాయి. అందుకే మృతుల్లో యువకులు ఉంటున్నారు. వైరస్ ను జయించిన వారిలో వృద్ధులు కూడా ఉంటున్నారు. కోలుకున్న వ్యక్తులు కూడా ఏ రోజైనా శ్వాస సంబంధ సమస్య మొదలైందని గుర్తించగానే వెంటనే ఆసుపత్రికి రావడం తప్పనిసరి అని వైద్యులు తెలుపుతున్నారు. మిగతా వైరస్ లకు, కరోనా వైరస్ కు మధ్య తేడాలున్నాయని, ఇది వేగంగా మనిషి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. అందుకే కోలుకున్న తర్వాత కూడా కొంతకాలానికి సీటీ స్కానింగ్ చేయించుకుంటే ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ తెలుస్తుందని పల్మనాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

జాగ్రత్తలే మేలు

కరోనా వైరస్ ప్రభావం తెలిసిందే. ఇప్పటికీ దానికి వాక్సిన్​ కూడా రాలేదు. సరైన చికిత్స అందుబాటులో రాలేదు. దీనిని జయించడానికి జాగ్రత్తలే తీసుకోవడం కన్నా వేరే మార్గాలు లేవు. ఓ సారి పాజిటివ్ వచ్చిన తర్వాత కొలుకుని నెగిటివ్​గా నిర్ధారణ అయినప్పటికీ అవయవాలపై దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కనీసం మూడు నెలలైనా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ సోకడం ద్వారా ఇబ్బంది పడిన వారిపై అధ్యయనం చేయాల్సి ఉందని, దాని ద్వారా కరోనా ఎంత ప్రభావం చూపుతుందో తెలుస్తుందని వైద్యులు అంటున్నారు.

డ్యామేజ్ ను బట్టి ఉంటుంది: డాక్టర్​ నవాజ్, పల్మనాలజిస్టు

అందరికీ ఈ కరోనా వైరస్ ప్రభావం ఒకే మాదిరిగా ఉండదు. దగ్గు, జ్వరం ఉన్నవారికి ఆర్టీపీసీ టెస్టు ద్వారా పాజిటివ్, నెగెటివ్ అనేది తేలుస్తున్నారు. కానీ సీటీ స్కాన్ ద్వారానే సమస్య తీవ్రత ఎంతన్నది తెలుస్తుంది. చికిత్స తర్వాత కరోనా వైరస్ నెగెటివ్ అని రావచ్చు. కానీ అది ఊపిరితిత్తులను ఏ స్థాయిలో డ్యామేజీ చేసిందో గుర్తించాలి. అది రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. యువత త్వరగా కోలుకున్నప్పటికీ వైరస్​ ప్రభావం శరీరంలో ఎన్నిరోజులు ఉంటుందన్నది తేలాలి. ఊపిరితిత్తుల్లో రక్త గడ్డ కట్టొచ్చు, హృదయ స్పందనల్లో మార్పులు ఉండొచ్చు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎక్స్ రే, సీటీ స్కాన్ల ద్వారా అవయవాల పురోగతిని అంచనా వేయొచ్చు. ఏ అవయవం ఎంత డ్యామేజీ ఉందో తెలుసుకుంటే చికిత్స సాధ్యం. కరోనాకు స్పష్టమైన చికిత్స లేదుకాబట్టి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. చికిత్స తర్వాత నెగెటివ్ గా తేలినా కొద్ది రోజుల పాటు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

కరోనా వైరస్ ప్రభావం చాలా రోజులు ఉంటుంది: డా.నాగరాజు, బోయిల్ల, సీనియర్ పల్మనాలజిస్టు

పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిందనడం ప్రధానం కాదు. తర్వాత కూడా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఇంటికి వెళ్లినా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2008 స్వైన్ ఫ్లూ ద్వారా జబ్బున పడిన వాళ్లు రికవరీ అయ్యారు. కానీ ఇప్పటికీ

వాళ్లలో కొంత మంది ఆస్తమా వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. అప్పటి వాళ్లు నేటికీ నా దగ్గరికి చికిత్సకు వస్తున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడం కష్టంగా ఉంది. ఈ క్రమంలో 30-40 ఏండ్ల వయస్సున్న వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కొందరు 70-80 ఏండ్ల వయస్సున్నోళ్లు విజయం సాధిస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ నుంచి నెగెటివ్ రావడం, నార్మల్ లక్షణాలు కనిపించిన తర్వాత రెండు నెలలకు మళ్లీ టెస్టులు చేయాలి. అప్పుడే ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోగలం. ఐతే ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరిగింది. మరణాల రేటు కూడా తగ్గింది. 3, 4 రోజుల తర్వాత నాకు తగ్గిందని బయట తిరిగే వాళ్లతోనే ఇబ్బంది. పూర్తిగా తగ్గే వరకు ఐసోలేషన్ లో ఉండడం తప్పనిసరి. కరోనా వైరస్ డేంజరస్ కాదు. కానీ అత్యంత వేగంగా వ్యాప్తి చెందేది.

Advertisement

Next Story

Most Viewed