ఇస్మార్ట్ బామ్మ

by Anukaran |   ( Updated:2021-04-04 09:15:16.0  )
Ismart Grandma
X

దిశ, కథాస్రవంతి: ఆదివారం కావడంతో ఆ రోజు లేట్ గా నిద్రలేచాడు చంద్రం..

హాల్లో కోలాహలంగా అనిపించడంతో.. వెళ్ళి చూశాడు. అక్కడ ఇరవై నుండి ముప్పై మంది దాకా జనం ఉన్నారు.. ఎవరు వీరంతా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడతను.

వారిలో కొందరు చంద్రం బామ్మతో సెల్ఫీలు దిగుతున్నారు మరికొందరు ఆమెతో మాట్లాడుతున్నారు.. కాసేపటి తరువాత ఆమెతో కేక్ కట్ చేయించి అందరూ వెళ్లిపోయారు.

అప్పుడు గుర్తొచ్చింది అతనికి.. ఈ రోజు బామ్మ పుట్టినరోజు అని.

ఆమె దగ్గరికెళ్ళి “హ్యాపీ బర్త్డే బామ్మ.. ” అని చెప్పి “వీళ్లంతా ఎవరు?” అని అడిగాడు.

“నీ లాగే నా మంచిని కోరేవారు రా” అంటూ లోపలికి వెళ్ళిపోయింది బామ్మ.

అక్కడే ఉన్న చంద్రం వాళ్ళ తాత చంద్రాన్ని కొరకొరా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు.. విషయమేంటో అర్ధం కాని చంద్రం “ఏమయ్యుంటుంది” అని ఆలోచిస్తూ అలాగే హాల్లో కూర్చుండిపోయాడు..

ఇంతలో అతని కొలీగ్ నుండి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు చంద్రం..

“హలో చంద్రం.. ఈ రోజు నా వైఫ్ పుట్టినరోజు.. మీ బామ్మగారిని మా ఇంటికి తీసుకెళ్లి వైఫ్ ని సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను” ఆన్నాడు చంద్రం కొలీగ్.

“మా బామ్మ ఎందుకు మల్లేష్? ఆవిడ ఎలా తెలుసు మీకు అసలు? అని అడిగాడు చంద్రం ఆశ్చర్యంగా.

“మీరు మరీ జోకులు వేస్తారు చంద్రం.. మీ బామ్మ తెలియకపోవడమేంటి? ఆమె యూట్యూబ్ ప్రభంజనం కదా.. నాలుగు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ సంవత్సరంలోనే లక్షల సబ్స్క్రయిబర్లను రీచ్ అయ్యారు.. ఇన్ని రోజుల నుండి ఆవిడ ఫేస్ కనిపించకుండా వీడియోస్ పెట్టేవారు.. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా యూట్యూబ్ లైవ్ కి వచ్చారు.. అప్పుడు తెలిసింది ఆమె మీ బామ్మగారు అని. నా వైఫ్ ఆవిడ వీరాభిమాని.. అందుకే ఈ రోజు తనని సర్ప్రైజ్ చేయడానికి మీ బామ్మగారిని నా వైఫ్ బర్త్డే పార్టీకి గెస్ట్ గా పిలుద్దామని నీకు కాల్ చేశాను” అని చెప్పాడు మల్లేష్.

“ఓకే మల్లేష్.. నేను బామ్మతో మాట్లాడి నీకు కాల్ చేస్తాను” అని కాల్ కట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూశాడు.

” బామ్మ చేతి వంటలు”, “బామ్మ చిట్కాలు”, “బామ్మ గారి ముత్యాల ముగ్గులు”, బామ్మ చెప్పే కథలు.. అనే నాలుగు ఛానెల్స్ బామ్మ రన్ చేస్తున్నట్టు తెలిసింది అతనికి.

“అంటే పొద్దున బామ్మతో కేక్ చేయించడానికి వచ్చిన వారు ఆవిడ అభిమానులన్నమాట” అనుకున్నాడు చంద్రం.

తాత చంద్రాన్ని కోపంగా చూడడానికి కారణం.. సంవత్సరం క్రితం అతడే స్మార్ట్ ఫోన్ ను గిఫ్ట్ చేశాడు బామ్మకు.

సరదాగా వీడియోలు తీసుకుంటుంది అనుకున్నాడు కానీ యూ ట్యూబ్ లో పెడుతుంది అనే విషయం ఇంతవరకు తెలియలేదు అతనికి.

హాల్లోనుండి తాత అరుపులు వినపడడంతో వెళ్ళి చూశాడు చంద్రం. బామ్మ మీద అరుస్తున్నాడు తాత.. “పిల్లలకు పద్ధతులు నేర్పాల్సిన వయసులో ఇవేం పనులు.. మన ఇంటా వంటా లేవు ఇలాంటివి.. చదువుకున్నదానివని పొగరా? నీకు పెళ్ళైన కొత్తలోనే చెప్పాను నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టంలేదు ఇంట్లో ఉండి పద్ధతిగా పనులు చేసుకో చాలు అని.. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇవన్నీ ఆపేయి.. ఇందాక నీకోసం వచ్చినవాళ్ళంతా ఇంట్లో గోలగోల చేస్తుంటే నా పరువంతా తీసేసినట్టు అనిపించింది. పెద్ద సెలబ్రిటీ అయిపోదామనుకున్నావా?” పుట్టినరోజు అని కూడా చూడకుండా..ఆమెపై అరుస్తున్న తాత కు బామ్మ నుండి “అవసరం లేదు” అనే సమాధానం వినిపించడంతో ఆశ్చర్యపోయాడు.

“నాకు సెలబ్రిటీ హోదా అవసరం లేదు.. నాకు నచ్చిన పనిని, నాకు వచ్చిన పనిని నలుగురికీ నేర్పిస్తున్నపుడు .. వారు నా టాలెంట్ ని గుర్తించి నన్ను అభిమానించడం మొదలుపెట్టినపుడు కలిగే ఆనందం ముందు ఇవన్నీ దిగదుడుపే..

ఈ ఆనందం ఇదివరకెప్పుడు నేను పొందనిది.. ఇకపై ఎప్పటికీ పొందాలనుకుంటున్నది..

పిల్లలికి పద్ధతులు నేర్పించాల్సిన వయసులో ఇవేం పనులు అన్నారు.. ముందు మీరు మీ అహాన్ని పక్కన పెట్టి నా వీడియోస్ చూడండి.. అప్పుడు కూడా ఈ మాట అనాలనిపిస్తే అనండి..

కొత్తగా పెళ్ళైన వారికి, బ్యాచిలర్స్ కి వంటలు నేర్పిస్తున్నాను, పిల్లలకి నీతి కధలు, స్త్రీల చిన్న చిన్న సమస్యలకు చిట్కాలు చెబుతున్నాను, ఆసక్తి ఉండి ముగ్గులు వేయడం రాని వారికి నేర్పిస్తున్నాను..

మీకు నేను బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అన్నారు..మరి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండే సంపాదిస్తున్నా మీకు నచ్చట్లేదు.. అంటే.. మీకు అసలు నేను సంపాదించడమే ఇష్టం లేదనుకుంటా కదా..

మీకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు.. ఒకవేళ తెలిసినా విషెస్ చెప్పే అలవాటు లేదు.. ఇందాక నన్ను అభిమానించే వారు వచ్చి విష్ చేసినా తట్టుకోగలిగే మనస్తత్వం కాదు కదా మీది.

మీరు ఉద్యోగంలో అంచలంచెలుగా ఎదుగుతున్నపుడు చూసి సంతోషపడిన నేను ఇప్పుడు చిన్న సక్సెస్ అందుకుంటే చూసి ఈర్ష్య పడుతున్నారా?

నేను మీకు చివరిగా ఒకటి చెప్పదలిచాను.. నేను ఇంత కష్టపడి వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం నెర్చుకోని.. ఇది మొదలు పెట్టింది మధ్యలో ఆపేయడానికి కాదు.. ఇదే నా నిర్ణయం” అని చెప్పడం ముగించింది బామ్మ.

కాసపటి నిశ్శబ్దం తరువాత చంద్రం తల్లి చప్పట్లు కొట్టింది.. తరువాత చంద్రం తండ్రి చెల్లి చివరకు చంద్రం కూడా చప్పట్లు కొట్టాడు..

“తాతకు మొదటిసారి ఎదురు చెప్పినా.. నీ మాటల్లో నిజం, నిజాయితీ, ధైర్యం కనిపించాయి బామ్మ” అని మనస్ఫూర్తిగా అభినందించి ఆమెను అతని కొలీగ్ భార్య బర్త్డే పార్టీకి తీసుకెళుతూ తాత కళ్ళల్లోకి చూశాడు చంద్రం.

అప్పటిదాకా బామ్మ ని ఈర్ష్యగా చూసిన ఆ కళ్ళల్లో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపించింది అతనికి.

-సాయి స్రవంతి

Advertisement

Next Story

Most Viewed