‘అనుమానాలుంటే వాట్సాప్‌ను డిలీట్ చేయండి’

by Anukaran |
‘అనుమానాలుంటే వాట్సాప్‌ను డిలీట్ చేయండి’
X

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని భావిస్తే ఆ అప్లికేషన్‌ను డిలీట్ చేసుకోండని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. వాట్సాప్‌ను వదిలిపెట్టి మరో యాప్‌కు వెళ్లండని, ఆ యాప్ వినియోగం స్వచ్ఛందమే కదా అని వివరించింది. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ వ్యక్తిగత గోప్యతను కాలరాస్తున్నదని, తమ వివరాలను ఫేస్‌బుక్, ఇతర థర్డ్ పార్టీ యాప్‌లతో పంచుకుంటున్నదని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవా ఏకసభ్య ధర్మాసనం విచారించింది.

యూజర్ల ప్రతికదలికను వాట్సాప్ విశ్లేషిస్తున్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది మనోహర్ లాల్ వాదించగా, ‘వాట్సాప్ మాత్రమే కాదు, అనేక ఇతర అప్లికేషన్‌లూ ఈ పనిచేస్తున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘గూగుల్ మ్యాప్స్ కూడా మీ డేటా షేర్ చేస్తుంది. దాని నిబంధనలు మీరు చదివారా?’ అని తెలిపింది. ప్రైవేట్ చాట్‌లు సుక్షితమేనని, కేవలం బిజినెస్ వాట్సాప్‌లకు సంబంధించే పాలసీలో మార్పులు చేశామని వాట్సాప్ వివరించింది. తదుపరి విచారణను ధర్మాసనం 25కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed