Govt Job బిందాస్ జిందగీ.!

by Daayi Srishailam |   ( Updated:2025-03-17 14:06:01.0  )
Govt Job బిందాస్ జిందగీ.!
X

బతుకు భద్రత కోసం..

ప్రభుత్వ ఉద్యోగం వెంట పరుగులు తీస్తాం.

రాత్రింబవళ్లు కష్టపడతాం.

ఉప్పిడి ఉపాసముంటాం.

కుటుంబానికి దూరంగా..

ఎక్కడో చిన్నపాటి రూమ్ తీసుకొని ప్రిపేరవుతాం.

పోరాడీ.. పోరాడీ.. మొత్తానికి నౌకరీ సాధిస్తాం.

ఫ్.. హమ్మయ్యా..

సర్కారు కొలువైతే వచ్చింది.

ఇకంతే లైఫ్.. ఫుల్టూ బిందాస్.!

పని చేసినా.. చేయకపోయినా.. వచ్చినా.. రాకపోయినా నడుస్తది.!!

అంతే కదా.? సర్కారు కొలువొచ్చిందా.. నెల నెలా అకౌంట్లో జీతం పడిందా.. ఓ ఇల్లు కొనుక్కున్నామా.. కారు తీసుకున్నామా బస్. ప్రభుత్వ ఉద్యోగి అంటే మొదాలు చేయాల్సినవి ఇవే. మరి డ్యూటీ.? ఎందుకు చేయరు.. అదికూడా చేస్తారు. కాకపోతే పంచ్ కొట్టామా.? అటెండెన్స్ పడిందా.? అనేదే ముఖ్యం. అడిగేవారు ఉంటారా.? ఆరా తీసేవారుంటారా అనే ధోరణి కనిపిస్తోంది.

పని చేయకపోయినా..

1. పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉండాలని కష్టపడి టీచర్ జాబ్ కొట్టిండు భూపాల్. సర్వీస్.. సమాజం గురించి మాట్లాడే భూపాల్ ఇప్పుడు భూములను ప్లాట్లుగా మార్చే బిజినెస్‌లో బిజీ అయ్యాడు. టీచర్ ఉద్యోగం పార్ట్ టైమ్ అయిపోయింది. ''నాదేంది బ్రో పని చేయకపోయినా నడుస్తదీ'' అనే భావనతో ఉన్నాడు.

2. వినయ్ పంచాయతీ‌రాజ్ ఉద్యోగి. జాబ్ రాకముందు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యేవాళ్లకు మోటివేషన్ క్లాసెస్ తీసుకునేవాడు. జాబొచ్చింది. ఇష్టమొచ్చినప్పుడు వెళ్లి పంచ్ కొట్టామా.. సాలరీ పడిందా.? చూసుకుంటాడంతే. గవర్నమెంట్ ఎంప్లాయ్ పని చేయకపోయినా చల్తా అనే ధీమా అతడిది.

బాధ్యతేది మరి.?

''ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయరు'' అంటారు నిజమేనా.? అని ఒక ఎంప్లాయ్‌ని అడిగితే.. ''భళేవారండీ. బాధ్యత లేకుండానే పొద్దున లేచి.. రెడీ అయ్యి.. కరెక్ట్ ఆఫీస్ టైమ్‌కి డ్యూటీకి వస్తున్నామా.?'' అన్నారు. చాలామంది బాధ్యతంటే కుటుంబ బాధ్యతే అనుకుంటున్నారు. కానీ బాధ్యతంటే ఉద్యోగంచేసి జీతం తీసుకుంటున్నందుకు రెస్పాన్సిబుల్‌గా సర్వీస్ చేయడం. కొందరైతే ఇలా అడిగితే ఊకెనే హర్ట్ అయ్యారు. ''మేం తిండీ తిప్పలు మానేసి.. అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకొని.. ఆనందాలకు.. అందమైన సాయంత్రాలకు దూరంగా ఉండి కష్టపడింది.. కన్నీళ్లు దాచుకున్నదీ దేనికోసం.? మాకు బాధ్యత లేదంటారేంటీ'' అని ప్రశ్నించారు. కానీ.. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. కుటుంబ బాధ్యతలోపడి ఉద్యోగ బాధ్యతను నిర్లక్ష్యం చేయొద్దూ అని.

మరచిపోతున్నారు

గవర్నమెంట్ ఉద్యోగులందరూ ఇలా ఉంటారని కాదు. చాలావరకు ఈ మైండ్‌సెట్‌తోనే ఉంటున్నారనేది సగటు సిటిజన్ ఒపీనియన్. ఉద్యోగం రాకముందేమో సమాజం.. దేశం కోసం సేవ చేస్తామంటారు. పబ్లిక్ సర్వెంట్ అయితే వ్యవస్థనే మార్చేయొచ్చనే సామాజిక స్పృహతో ఉంటారు. కానీ.. తీరా ఉద్యోగం వచ్చేసరికి సల్లగైతారు. ''ఉద్యోగం వచ్చాక సమాజం ఎందుకు గుర్తుండదు మీకు'' అని ఒక ఉద్యోగిని అడిగితే.. ''మనం ఒక్కరమే బాధ్యతగా ఉంటే ఈ సొసైటీ మారుతుందా.? మనమెవ్వరమండీ కోటి లింగాల్లో బోడి లింగాలం'' అని సింపుల్ ఆన్సరిచ్చాడు. గవర్నమెంట్ ఉద్యోగంతో వచ్చే సౌకర్యాలు.. వనరుల లెక్కలేసుకునే బిజీలో పడి గతం తాలుకూ కష్టాన్ని.. వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే ప్రజలు పడే ఇబ్బందినీ మర్చిపోతారిలా.

రిలాక్సయ్యేందుకేనా.?

ప్రభుత్వ ఉద్యోగమంటే అందరికీ ఆసక్తే. ఎందుకంటే లైఫ్ సుఖూన్ ఉంటుంది కదా. ''మా కొడుకు కొలువు చేస్తుండు'' అని చెప్తే ''గవర్నమెంట్ జాబా'' అని ఠక్కున అంటారంతే. అందుకే పోటీ తీవ్రంగా ఉంటుంది. ''సర్కారు కొలువుంటే మీ దృష్టిలో ఏంటి.?'' అని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువకుడిని అడిగితే.. ''కాలుమీద కాలేస్కొని బతకొచ్చు. డబ్బుకు ఢోకా ఉండదు. ఎవడి దగ్గరా చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు'' అని ఆన్నాడు. కానీ.. ''గవర్నమెంట్ జాబ్ అనేది ఒక బాధ్యత. దానికీ కొన్ని నిబంధనలు ఉంటాయి. పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్నందుకు పావలా వంతు అయినా పబ్లిక్ కోసం పనిచేయాలి'' అని మాత్రం ఆలోచించలేక పోయాడతను. అంటే.. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంతసేపూ రిలాక్స్‌డ్ జోన్‌గానే భావిస్తున్నారు తప్ప.. సర్వీస్ ఛాయిస్‌గా భావించడం లేదు.

అలసిపోయారా రాజా.?

''మొన్నొక స్కూల్లో విద్యార్థులు చెప్తే వింటలేరని గుంజీలు తీసిండు టీచర్. దానిపై మీ స్పందనేంటి'' అని ఇంకో టీచర్‌ని అడిగితే.. ''పబ్లిసిటీ కోసం చేసి ఉంటాడు. ఎవరి బాధ్యతను వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటివేం అవసరం లేదు. అయినా ఏదో తప్పుచేసినట్లు గుంజీలు తీయడమేంటి.?'' అన్నాడతను. ఇంత చెప్పాడంటే సారు కథ పెద్దదే అని ఆరా తీస్తే.. సారు స్కూల్లో మొత్తం 15 మందే విద్యార్థులట. పనిలేదు పాటలేదు. పొద్దున తెల్లారింది మొదలు వాట్సప్‌లో ఎల్లయ్య ఏమన్నడు.. మల్లయ్య ఏమన్నడూ అనే రాజకీయ కామెంట్లు చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడట. చూడండీ ఇంతే కొందరి కథ. జాబ్ వచ్చేంత వరకే ఉరుకులాట.. పరుగులాట. వన్స్ జాబ్ వస్తే.. ఇలా టైంపాస్ చేసి కాలం గడుపుతుంటారు.

సూక్తులు వద్దు బాస్

ఒక ఆఫీసర్. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మంచి మంచి కొటేషన్లు.. నీతి సూక్తులు పోస్టు చేస్తుంటారు. స్పందన కూడా బాగుంటుంది. ఏమైందో ఏమోగానీ వన్ ఫైన్ ఆఫ్టర్‌నూన్.. యాంటీ కరప్షన్ టీమ్‌కు దొరికారు. అదీ రూ.50వేలు లంచం తీసుకుంటూ. అంతా నివ్వెర పోయారు. ''ఏంటీ.. ఈ ఆఫీసర్ ఇలా చేశారని'' పాపం జనాలే మస్తు ఫీలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆ ఆఫీసర్ సూక్తులు బందయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజలకు సూక్తులు చెప్తూ వాటినే మనం పాటించకపోవడం.. మేమేది చేసినా నడుస్తుంది అనుకోవడం ఎంత దిగజారుస్తుందో అర్థం చేసుకోవచ్చు. పనిచేసినా.. చేయకపోయినా నడుస్తదనే భావన కాస్త.. పని చేసేందుకు పైసలు తీసుకున్నా నడుస్తదనేదాక తీసుకెళ్లి ఇలా చేస్తుంది చూడండి.

ఆపండయ్యా ఆ కామెంట్లు

కొందరు ఎంప్లాయిస్ బాగా తెలివిగా.. చాకచక్యంగా ఉంటారు. ఆ తెలివిని పనిలో చూపిస్తే ఎంతో బాగుంటుంది. చేసే పని సక్రమంగా చేస్తే ప్రజలు పది కాలాల పాటు యాది చేసుకుంటారు. అవన్నీ మర్చిపోయి రాజకీయాల్లో వేలు పెడుతుంటారు. ఒకసారి ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూడండీ. ఉద్యోగులు పార్టీలుగా విడిపోయి పార్టీ కార్యకర్తల్లా కామెంట్లు చేస్తుంటారు. ఆ నాయకుల.. పార్టీల మెప్పు పొందితే పని చేయకపోయినా నడుస్తుందనే ధీమా కావచ్చు. భాషను కూడా మర్చిపోయి రాజకీయ రచ్చ చేస్తుంటారు. ఒకప్పుడు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవాళ్లు రాజకీయాల గురించి మాట్లాడాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగానే తిట్లు.. విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

  1. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు వృత్తి నైపుణ్యం.. క్రమశిక్షణ.. పని నీతిని కలిగి ఉంటారు.
  2. జవాబుదారీతనం.. బాధ్యత ధర్మంగా భావిస్తారు.
  3. రెగ్యులర్‌గా వారి పనితీరును సమీక్షిస్తారు.
  4. ఏదో వచ్చామా.. అటెండెన్స్ వేసుకున్నామా అనే ధోరణి ఉంటే క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  5. నియమాలను ఉల్లంఘిస్తే సస్పెన్షనే ఇక.

  1. చైనాలో ప్రభుత్వ ఉద్యోగులకు 2020లో కొత్త క్రమశిక్షణ చట్టం అమల్లోకి వచ్చింది.
  2. ఉద్యోగులు సొంత పనులపై కాకుండా వృత్తిపై విధేయత చూపిస్తారు.
  3. కమ్యునిస్ట్ పార్టీ.. దేశం పట్ల విధేయత ప్రదర్శించాలని.. సోషలిజం సూత్రాలను నిలబెట్టాలనే నిబంధన ఉంది.
  4. నిజాయతీ.. సమగ్రత.. ఉద్యోగ నీతి ప్రమాణాలను పాటిస్తారు.
  5. పనిలో నిర్లక్ష్యం చూపిస్తే తొలగింపు చర్యలు తీసుకుంటారు.

  1. ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి చట్టం 1964 ప్రకారం విధుల పట్ల అంకితభావం చూపాలి.
  2. ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి.. రాజ్యాంగాన్ని కాపాడాలి.
  3. పనిలో నిజాయీతీ.. పారదర్శకత కొనసాగించాలి.
  4. పనిలో నిర్లక్ష్యం చేస్తే జరిమానాలు.. సస్పెన్షన్లు ఉంటాయి.


నార్వే ఫస్ట్

  • నార్వేలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. ఇక్కడి జనాభాలో 30శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత డెన్మార్క్ 29.1శాతం.. స్వీడన్ 28.6శాతం.. ఫిన్లాండ్ 24.9శాతం ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉండే భద్రత.. సౌకర్యాలతో పాటు సంతృప్తి కోసం వీరు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

మెజార్టీ ఉద్దేశం

  • ప్రభుత్వ ఉద్యోగం సురక్షితం.. స్థిరంగా ఉంటుందని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జీవితకాల ఉపాధి దొరుకుతుంది.. పెన్షన్ ఉంటుందని కొందరు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఆరోగ్యా బీమా ఉంటుంది. పదవీ విరమణ ప్రయోజనాలుంటాయి. సాధారణ పని గంటలు ఉంటాయి. అన్నింటికి మించి పనిచేసినా చేయకపోయినా నడుస్తుంది అనే ఉద్దేశం మెజార్టీ ప్రజల్లో ఉంది.
Next Story

Most Viewed