- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 వేల ఉద్యోగాల ఫైల్ కదలకపోవడానికి కారణం అదేనా?
కొలువుల కథ మరో మారు కొండెక్కింది. ఐదురోజుల్లో ఖాళీలపై నివేదిక ఇవ్వాలన్నరాష్ట్ర కేబినెట్ ఆదేశాన్ని యంత్రాంగం పెడచెవిన పెట్టిందా..? వివరాలు అందినా ప్రభుత్వమే ఫైలును పక్కన పెట్టిందా? అనేది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల బిజీలో పడి నోటిఫికేషన్లపై సీఎం నోరెత్తడం లేదా? అన్న సందేహాలు వీడటం లేదు. ఈ నెల 14న కేబినెట్ భేటీ జరిగింది. 16 రోజులు పూర్తయినా ఉద్యోగఖాళీల లెక్కతేలలేదు. సర్కారు దాటవేత ధోరణిని నిరసిస్తూ మంత్రులకు, సీఎంకు నిరుద్యోగులు పలుచోట్ల నిరసనలు సైతం తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇంతకు ఉద్యోగనోటిఫికేషన్లు వస్తాయా? రావా? అన్న సందేహం నిరుద్యోగులను వెంటాడుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ మళ్లీ వెనక్కి పోయింది. హుజూరాబాద్ రాజకీయ వేడిలో సమసిపోతున్నది. ప్రస్తుతం 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అటకెక్కింది. సీఎం కేసీఆర్ ఐదు రోజుల గడువు విదితమే. పక్షం రోజులు దాటుతున్నా ఫైలు ముందుకు కదలడం లేదు. సీఎం ఆదేశాలు పట్టింపులేనట్టుగా ఖాళీలపై నివేదిక లేదు. సర్కారు తీరుకు నిరసనగా.. నిరుద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వచ్చేనెలలో నిరసన బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఇచ్చినట్టే… ఊరించారు
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త… త్వరలోనే ఉద్యోగాల భర్తీ అంటూ ఊరించిన సర్కారు గతంలో మాదిరిగానే మరిచిపోయింది. నిరుద్యోగ భృతి అంటూ ఎలా పక్కన పడేశారో… ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమవుతున్నది. గత నెల నుంచి కొలువుల భర్తీపై చాలా ఆశలు పెట్టారు. 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా సీఎం రాగానికి కోరస్ అందుకున్నారు. ఎక్కడైనా.. ఏ కార్యక్రమమైనా రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామంటూ ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఖాళీల లెక్క తీయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ముందుగా 30 వేలు, ఆ తర్వాత 40 వేలు అంటూ ఖాళీలపై తలలు పట్టుకుని, నాలుగైదుసార్లు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన సీఎస్ సహా ఉన్నతాధికారులు 45 వేల ఖాళీలపై నివేదిక ఇచ్చారు. మళ్లీ అన్ని శాఖల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఖాళీలపై ఐదురోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నెల 14న రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. 16 రోజులు గడిచిపోయినా ఆ ఊసే లేకపోవడం గమనార్హం.
రిపోర్టు వెళ్లిందా… లేదా..?
ప్రస్తుతం రాష్ట్రంలోని 26లక్షలకుపైగా నిరుద్యోగులు, మూడున్నర లక్షలకుపైగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న అంశం ఒక్కటే. ఖాళీల నివేదిక సీఎంకు వెళ్లిందా? లేదా? అనేదే. సీఎంకు ఫైల్ చేరిందని, గతంలో పీఆర్సీ ఫైల్ తరహాలోనే ఉద్యోగాల ఖాళీల నివేదికను ఆయన పక్కన పెట్టారంటూ ఉద్యోగ వర్గాలు అంటుంటే… అసలు అధికారులు నివేదిక ఇవ్వలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. ఇక “ సీఎం కేసీఆర్ త్వరలో ఉద్యోగాలు భర్తీ అంటే ఆరేండ్లు దాటింది… ఇక ఐదు రోజుల్లో నివేదిక అంటే ఐదేండ్లు ఆగాల్సిందే..” అంటూ సెటైర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 19న మంత్రి హరీశ్‌రావు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమై ఖాళీల వివరాలను పరిశీలించారని, అనంతరం ఈ నెల 20న నివేదికను సీఎంకు ఇచ్చారని, కానీ సీఎం ఆ ఫైలును పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ కొంతమంది అధికారులు కూడా చెప్పుకుంటున్నారు.
56 వేల ఖాళీలు ఉత్తివేనా?
సీఎస్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారులు రాష్ట్రంలో 56,979 ఉద్యోగాలు ఖాళీలున్నాయని నివేదిక ఇచ్చారు. వాస్తవంగా ఈ నివేదికపై అనుమానాలు ఉన్నాయి. అప్పటికే పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు 1.91 లక్షలు. కానీ అధికారులు మాత్రం 56 వేలుగా చూపించారు. అంతా ఇది ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖాళీలు తేల్చడంలోనే కాలం వెళ్లదీస్తారనే ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే ఖాళీల నివేదికపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం, మళ్లీ నివేదిక కోరడం, ఇప్పుడు అది సాగదీస్తుండటంతో నిరుద్యోగులతో ఆడుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
నిరసనలతో పోరు
మరోవైపు తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తరుపున దీనిపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ కూడా సహకరించాలని నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిరుద్యోగ దీక్ష చేస్తామని వారం కిందటే ప్రకటించారు. కానీ ప్రభుత్వం వరుసగా ప్రకటన చేయడంతో వాయిదా వేసుకున్నారు. ఇప్పటికీ నోటిఫికేషన్లు రాకపోవడం, ఖాళీలు తేల్చకపోవడంతో నిరుద్యోగులతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉద్యోగాల కోసం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ను సైతం నిరుద్యోగులు అడ్డుకున్నారు.
వంద శాతం అబద్ధాలు సీఎం
స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమానికి ఊపిరిపోశాం. యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్ దెబ్బలు తిన్నారు. అప్పుడు ఆంధ్రా వాళ్ళు… ఇప్పుడు స్వరాష్ట్ర నేతలు విద్యార్థులను నిరుద్యోగులుగా మార్చుతున్నారు. కనీసం యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, గ్రూప్ –1 పోస్టులన్నీ ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు రావడం లేదు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు నిరుద్యోగులు, రైతులు, దళితులు గుర్తుకు వస్తారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా భర్తీ చేయడం లేదు. కేవలం హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల భర్తీపై హడావుడి చేస్తున్నారే తప్ప భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేదు. దీనిపై నిరుద్యోగ జేఏసీ తరుపున పోరాటం చేస్తాం. త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కార్యాచరణను ప్రకటిస్తాం.
-వడత్య భీంరావు నాయక్, రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్