- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రోలింగ్‌లోనూ వివక్షే?
దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో మహిళలకు గౌరవమివ్వాలని పదే పదే చెబుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మహిళలను ‘బ్యూటీ డాల్స్’గా మాత్రమే చూస్తూ అణచివేతకు గురిచేస్తుంటారు. ఇక ‘ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ’కి చెందిన మహిళల పట్ల మరింత చులకన భావాన్ని ప్రదర్శిస్తూ, వారిపై ట్రోలింగ్ చేస్తుంటారు. ప్రధానంగా ఫిమేల్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ ధోరణి విపరీతంగా పెరిగింది. వాళ్లకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా అన్నింట్లోకి తలదూర్చేస్తారు. తాజాగా బుల్లితెర నటి రశ్మి దేశాయ్ కూడా ట్రోలింగ్‌కు గురైంది. నెటిజన్లు ఆమెను తీవ్ర పదజాలంతో దూషించడంతో.. ప్రధాని సహా, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రశ్మి.
హిందీ సీరియల్ నటి అయిన రశ్మి దేశాయ్ ఫొటోపై.. ‘మహిళవు కాదా నువ్వు’ ‘సిగ్గులేని ఆంటీ’ అంటూ ఇద్దరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన రశ్మి.. ‘మీ అమ్మ, అక్క, చెల్లి, గర్ల్ ఫ్రెండ్‌తో పాటు అందరి ఆడపిల్లలపైనా మీకు ఇలాంటి ఆలోచనలే ఉండి ఉంటాయి. అలానే మీరు కూడా నేర్చుకున్నారు, మీది వల్గర్ మైండ్.. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది’ అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా సదరు ట్రోలింగ్స్‌ను ప్రధాని మోదీ, ముంబై పోలీస్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్, సైబర్ క్రైమ్ ఇండియాలకు ట్యాగ్ చేసింది.
ఈ ఒక్క సంఘటనే కాదు.. బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురిగా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. స్కూల్ డేస్ నుంచి తన వెయిట్‌పై విమర్శలు ఎదుర్కొంది. తాజాగా సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలోనూ వారసత్వం వల్లే ఆమెకు అవకాశాలు వచ్చాయంటూ నెటిజన్లు ట్రోల్ చేయడంతో.. ఏకంగా ఆమె ట్విట్టర్ నుంచి వైదొలిగింది. ఇక తెలుగు, హిందీ చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి.. అప్పట్లో తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా… కొందరు నెటిజన్లు ఆమె శరీరాకృతిని టార్గెట్ చేసుకొని దారుణమైన కామెంట్లు చేశారు. దానికి మీరు కూడా మీ తల్లి గర్భం నుంచే వచ్చారు కదా? నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి చాలా హాట్‌గా ఉందా? అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది సమీరా. ఇక తెలుగు హీరోయిన్ సమంత కూడా ట్రోలింగ్ బాధితురాలే. ఇక నెట్టింట్లో తరచూ ట్రోలింగ్ బారిన పడేవారిలో బుల్లితెర యాంకర్ అనసూయ ఒకరు. ఆమె కూడా వారికి గట్టిగా సమాధానమిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇవన్నీ కొంతమంది సెలెబ్రిటీల ఉదాహరణలు మాత్రమే. ఇలా చాలా మంది సెలెబ్రిటీల విషయంలో జరిగింది.. జరుగుతోంది. వాళ్లంతా నెటిజన్ల విపరీత దూషణలకు బాధపడుతున్నారు. అయితే, విమర్శ అనేది ఒకరిని అవమానించేలా ఉండకూడదు. వారు పబ్లిక్ లైఫ్‌లో ఉన్నంత మాత్రాన వాళ్ల పర్సనల్ లైఫ్ మీద కామెంట్ చేసే అధికారం ఇచ్చినట్లు కాదు. వారి కట్టుబొట్టు విషయంలో కామెంట్ చేసే హక్కు మనకెక్కడిది? వాళ్లు బరువు పెరిగినా, సన్నజాజుల్లా నాజూకుగా మారిపోయినా.. అదంతా వారి ఇష్టం. దానికి నెటిజన్ల రియాక్షన్ ఎందుకు? అందులో వల్గారిటీతో ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సబబు. హీరోయిన్లు, బుల్లితెర నటులు, యాంకర్ల విషయంలో మాత్రమే ఇలాంటి వ్యవహార ధోరణి ఎందుకు వస్తుంది. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. మరి ఆ సంప్రదాయం ఎటు పోయింది? ఎందుకు పరిధి మీరి ట్రోలింగ్ చేయడం? అని ఒకసారి ఆలోచించుకుంటే.. ఒకరి బాధకు మనం కారణం కాకుండా ఉండొచ్చు.
ఓ ఫిమేల్ సెలెబ్రిటీ పెళ్లి చేసుకున్నా, ప్రెగ్నెంట్ అయినా, విడాకులు తీసుకున్నా, ఫ్రెండ్స్‌తో పార్టీలకు వెళ్లినా.. వెంటనే ఆమె మీద ట్రోలింగ్స్ మొదలవుతాయి. అదే మేల్ సెలెబ్రిటీ విషయంలో మాత్రం ఇలా జరగదు. అంతేకాదు ఫిమేల్ సెలెబ్రిటీలు ఎప్పుడైనా పొరపాటున హీరోల విషయంలో, దర్శకుల విషయంలో ఏమాత్రం నెగెటివ్‌గా మాట్లాడినా.. ఇక అంతే సంగతులు. సదరు హీరో అభిమానులైతే, పొరపాటు చేసింది ఓ మహిళ అని కూడా ఆలోచించకుండా ఆమెపై సోషల్ మీడియా వేదికగా దాడులకు దిగుతారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. తెర మీద వాళ్లను చూసి సంతోషించాలి కానీ, తెర ముందున్న వాళ్ల వ్యక్తిగత జీవితాలు, హాబిట్స్, ఒపీనియన్స్, థింకింగ్స్ వంటి విషయాల్లోకి తొంగి చూడటం మానేయాలి. అప్పుడే అటు వాళ్లు, అభిమానులుగా.. మీరూ సంతోషపడవచ్చు.