గుజరాతీ ప్రైడే.. భారత్ ప్రైడా?

by Shamantha N |
గుజరాతీ ప్రైడే.. భారత్ ప్రైడా?
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉదయం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు భారత ప్రధాని మోడీ ఆత్మీయ ఆలింగనంతో ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్‌తో ఆహ్వానించారు. అయితే, ట్రంప్‌నకు ఆహ్వానం పలికిన గుజరాతీ కళాకారులు, ఆయన పర్యటించే దారి పొడవునా గుజరాత్ సంప్రదాయ క్రీడ ‘మల్లకంబ’ నిర్వహించడం, అడుగడుగునా గుజరాతీ గుబాళింపు వెనుక రాజకీయం ఉందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో పరిశీలిద్దాం.
ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భారత యాత్ర ఉపకరించొచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉన్న గుజరాతీ ప్రవాస భారతీయులు ట్రంప్ భారత పర్యటన, ముఖ్యంగా గుజరాత్ సందర్శన వల్ల ఆయన వైపే మొగ్గు చూపే అవకాశముందని పరిశీలకుల అంచనా. ఈ పర్యటనలో గుజరాతీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రవాస భారతీయులు గుజరాతీ సంస్కృతిని మననంలోకి తీసుకొచ్చేందుకేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

‘‘భారత ప్రధాని మోడీ నా స్నేహితుడు, భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత ప్రజలను, అక్కడి గొప్ప మిత్రులను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఉవ్విళ్లూరుతున్నా’’ అని నిన్న ట్వీట్ చేసిన ట్రంప్.. సబర్మతీ ఆశ్రమ సందర్శన సందర్భంగా రిజిస్టర్‌లో ‘‘అద్భుతమైన సందర్శనకు, నా గొప్ప స్నేహితుడు మోడీకి కృతజ్ఞతలు’’ రాశారు. ఇక్కడ సునిశితంగా పరిశీలిస్తే భారత్ ప్రజలు, భారత సంస్కృతి కంటే కూడా మోడీ అనే వ్యక్తికే ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే గుజరాతీ ప్రైడ్‌గా తన రాజకీయ పయనాన్ని ప్రారంభించిన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత నేడు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, మోడీ ప్రభావం అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులపై ఉంటుందా.. అది ట్రంప్‌నకు కలిసొస్తుందా.. అనేది చూడాలి.

ఉజ్వల భవిష్యత్ ఎవరిదో మరీ?

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర వీధులన్నీ‘ఉజ్వల భవిష్యత్ కోసం బలమైన స్నేహం’ కోసం ట్రంప్ భారత్‌కు వస్తున్నట్టు హోర్డింగులతో నిండి పోయాయి. ఆ హోర్డింగుల్లో మోడీ, ట్రంప్ ఫొటోలు ఉన్నాయి. కానీ, ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ కనబడలేదు. అయితే, ట్రంప్ పర్యటన వల్ల ఉజ్వల భవిష్యత్ ఎవరికి ఉంటుంది? దేశాలకా? లేదా వ్యక్తులుగా ఆ దేశాధినేతలుగా ఉన్న ట్రంప్, మోడీలకా.. అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ పర్యటన వల్ల భారత్‌కు ఒరిగేదేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Read Also..trump welcome in gujarat state,

నితిన్‌కు బన్నీ డబుల్ కంగ్రాట్స్

Advertisement

Next Story

Most Viewed