అక్రమాలకు అడ్డాగా జగిత్యాల మున్సిపాలిటీ.. కన్నెర్ర చేసిన బీజేపీ నాయకులు

by Sridhar Babu |   ( Updated:2021-08-03 07:57:26.0  )
bjp protest
X

దిశ, జగిత్యాల: అవినీతి, అక్రమాలకు జగిత్యాల మున్సిపాలిటీ అడ్డాగా మారిందని, దీనికి బాధ్యత వహిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జీ ముదుగంటి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రోజున మున్సిపల్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు నిరసన చేపట్టిన నేతలు ప్రభుత్వం, మున్సిపల్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం గేటు దూకెందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగినప్పటికి బీజేపీ నాయకులు కార్యాలయంలోనికి చొచ్చుకుని వెళ్లి చైర్ పర్సన్ చాంబర్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ స్వామి అక్కడికి చేరుకొని నాయకులను బయటకు పంపించారు. అనంతరం మున్సిపల్ అధికారికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలని, మున్సిపల్‌లో అధికార పార్టీ నాయకుల అండదండలతో నిబంధలను అతిక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు.

ఎప్పుడు రద్దీగా ఉండే టవర్, మార్కెట్ లాంటి ప్రాంతాలలో నడవడానికే ఇబ్బందిగా ఉంటుందని, ఎలాంటి పార్కింగ్ సౌకర్యం లేకుండా మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని అన్నారు. అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల బీజేపీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని రవీందర్ రెడ్డి హెచ్చరించారు.

అవినీతి, అక్రమాలకు నైతిక బాధ్యత వహించి మున్సిపల్ చైర్ పర్సన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంటసేపు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎస్సైలు నవతా, నారాయణ బాబు, ఏఎస్సైలు వేణు, చంద్రయ్య, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ధర్నాలో నాయకులు ఏసీఎస్ రాజు, కౌన్సిలర్ గుర్రం రాము, మాజీ కౌన్సిలర్ ఆరవ లక్ష్మి, ఆముద రాజు, బిట్టు, అరుణ్, విద్యా సింగ్, చీటి శేఖర్ రావు, కూర్మాచలం సతీష్, జ్యానేశ్వర్, శ్రీకాంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed