మీకు తెలుసా.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కొనుకోవొచ్చు!

by Anukaran |   ( Updated:2020-08-10 20:38:57.0  )
మీకు తెలుసా.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కొనుకోవొచ్చు!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఫ్రీగా కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండోసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా పేదల కల నెరవేరడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నరు. పేదలకు ఫ్రీగానే డబుల్ ఇళ్లు ఇస్తామని చెప్పి.. డబ్బులు వసూలు చేస్తున్నారని అర్హులు మండిపడుతున్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టేందుకు ఓ వైపు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉంటే.. మరో వైపు దళారీ వ్యవస్థ చేతిలో డబుల్ ఇళ్ల పంపిణీ జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అర్హులైన లబ్ధిదారులకే డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని, పారదర్శకతతో కలెక్టర్లే ఎంపిక చేస్తారని ఇంతకాలం ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. చాలీ చాలని వేతనాలతో ఇంటి అద్దెలు చెల్లించలేక మధ్య తరగతులకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. నిలువ నీడలేక గుడిసెల్లో నివసించే నిరుపేదల సంఖ్య కోకొల్లలనే చెప్పాలి. అలాంటి వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు.

కేటీఆర్‌ నియోజకవర్గంలోనే..

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 168 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ఎంపికైన అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు. కానీ అధికారుల సమావేశంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ముందుగా రిలీజ్ చేసిన జాబితా ప్రకారం కాకుండా వేరే వాళ్లకు కేటాయించారు. ఇందులో సుమారు 60 మంది అనర్హులున్నట్లు స్థానికులు ఆందోళనకు దిగారు. నెల రోజుల క్రితం జరిగిన గ్రామ సభలో ఇచ్చిన జాబితాకు, తాజాగా ప్రకటించిన జాబితాకు చాలా వ్యత్యాసం ఉందని మండిపడ్డారు. ఈ జాబితాలో 60 మంది పేర్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 168 ఇళ్ల కోసం 365 మంది దరఖాస్తు చేసుకోగా ఒకే ఇంటికి చెందిన ముగ్గురు అన్నదమ్ములకు జాబితాలో పేరు రావడం, ధనికుల పేర్లు కూడా లిస్టులో ఉండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారాయని నిరూపించే ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాలరాజు, ఓ ఏజెంట్, లబ్ధిదారుడి మధ్య జరిగిన సంభాషణల ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మాణ దశలోనే..

ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో 15 మున్సిపాలిటీల్లో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల పూర్తయ్యే దశలో ఉన్నాయి. చాలా మున్సిపాలిటీల్లో అసలు నిర్మాణ పనులే మొదలు పెట్టలేదు. పునాదుల దశల్లో, గోడలు.. స్లాబుల దశలో మరికొన్ని ఉన్నాయి. అయితే నిర్మించే ఇళ్ల సంఖ్య కూడా ఇల్లులేని నిరుపేదలకు సరిపడా కట్టడం లేదు. జిల్లాలో మంజూరైన ఇళ్లకు, నిర్మాణాలు పూర్తైన గృహాల లెక్కకు మధ్య ఆకాశానికి పాతాలానికి ఉన్నంత దూరం కనిపిస్తోంది. కరీంనగర్ కొత్త జిల్లాలో రెండు విడతల్లో 6,494 ఇండ్లు మంజూరు కాగా 1,200 డబుల్ బెడ్ రూం ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. జగిత్యాల జిల్లాలో మొత్తం 7,290 ఇళ్లు మంజూరు కాగా కేవలం వెయ్యి మాత్రమే పూర్తయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 6,786 డబుల్ బెడ్ రూం ఇళ్లకు అనుమతి రాగా, ఇప్పటి వరకు రెండు వేల దాకా ఇండ్లు పూర్తయ్యాయి.

దళారుల జోక్యం..

నిర్మాణాలు పూర్తై లబ్ధిదారులకు అందిద్దామనుకున్న చోట దళారులు, చోటా నాయకులు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గతంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో ఆందోళనలు జరిగాయి. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో నిర్మించిన 25 ఇళ్లలో చాలా వరకు సర్పంచికి సంబంధం లేకుండా ఏకపక్షంగా కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే లబ్ధిదారులను ఎంపిక చేసి క్వాలిటీతో నిర్మించి ఇస్తామంటూ ఒక్కో లబ్ధిదారుడి నుంచి అదనంగా రూ. 40 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 40 ఇండ్లు కట్టి లబ్ధిదారులకు అందజేసినా.. ఇక్కడా చాలా మంది అర్హులకు అందలేదు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో మాత్రం గతంలో కూల్చిన పాత ఇళ్ల స్థానంలో దాదాపు 250 కొత్తవి కట్టించి ఇచ్చారు. చిన్న ముల్కనూరు మినహా కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఎక్కడా ఇళ్లు ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed