గతేడాది ఐపీఎల్‌లో రెచ్చిపోయిన ఆటగాళ్లు వీరే..!

by Anukaran |   ( Updated:2021-04-01 08:36:39.0  )
గతేడాది ఐపీఎల్‌లో రెచ్చిపోయిన ఆటగాళ్లు వీరే..!
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌ను బ్యాట్స్‌మాన్ గేమ్ అంటారు. అప్పుడప్పుడు బౌలర్లు పై చేయి సాధించినా.. అంతిమంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మాత్రమే ఆట నడుస్తుంటుంది. ఇక ధనాధన్ క్రికెట్ టీ20 ఫార్మాట్ వచ్చాక బ్యాట్స్‌మాన్ ఆధిపత్యం మరింతగా పెరిగిపోయింది. ఐపీఎల్ వంటి క్రికెట్ లీగ్స్‌లో ఏదైనా జట్టు గెలవాలంటే వాళ్ల బ్యాట్స్‌మెన్ తప్పక రాణించాలి. ఏ జట్టులో అయితే బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్ కూడా రాణిస్తారో ఆ జట్టే విజేతగా నిలవడం గత కొన్ని సీజన్లుగా చూస్తూనే ఉన్నాం. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో నిర్వహించారు. ఖాళీ స్టేడియాల్లో జరిగిన ఈ ఐపీఎల్‌లో కూడా బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. కాగా, ఎన్నడూ లేని విధంగా ప్లేఆఫ్స్‌కు చేరని జట్టు బ్యాట్స్‌మాన్ టాప్ స్కోరర్‌గా నిలవడం ఈ సీజన్ విశేషం. ఇక టాప్ ఫైవ్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు సభ్యులే ఉన్నారు. అవేంటో ఒకసారి లుక్కేద్దాం..

ఆరెంజ్ క్యాప్ కేఎల్ రాహుల్..

ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) కెప్టెన్ కేఎల్ రాహుల్ 670 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. కేవలం 14 మ్యాచ్‌లలో 55.83 సగటుతో ఈ స్కోర్ సాధించడం విశేషం. గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై కేవలం 69 బంతుల్లోనే 132 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇది 13వ సీజన్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరు. కేఎల్ రాహుల్ ఒక సెంచరీతో పాటు 5 అర్ద సెంచరీలు కూడా నమోదు చేశాడు. లీగ్ మొత్తం కలిపి 58 ఫోర్లు, 23 సిక్సులతో చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్‌కు మయాంక్ కలసి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు వరుస విజయాలు అందించారు. మయాంక్ కూడా ఒక సెంచరీ బాదడం విశేషం. అయితే ఎప్పటి నుంచైతే వీరిద్దరూ భారీ స్కోర్లు చేయడం కుదరలేదో.. అప్పటి నుంచి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు వరుస ఓటములు ఎదురయ్యాయి. మొదట్లో టేబుల్ టాపర్‌గా ఉన్న పంజాబ్ జట్టు చివరకు ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ధనాధన్ ధావన్..

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌ 13లో వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు. గత సీజన్‌లో నిలకడగా ఆడిన ధావన్ అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఢిల్లీ జట్టు ఫైనల్ చేరయడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు (67) కొట్టిన బ్యాట్స్‌మాన్‌గా ధావన్ రికార్డు సృష్టించాడు. సీజన్ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 44.14 సగటుతో 618 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 4 అర్దసెంచరీలు ఉన్నాయి. 67 ఫోర్లతో పాటు 12 సిక్సులు కూడా ధావన్ ఖాతాలో ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మంచి ఫామ్‌లోకి వచ్చిన ధావన్.. ఈ సారి కూడా తన బ్యాట్‌తో పరుగుల వరద పారించే అవకాశం ఉన్నది.

ముగ్గురు ముంబైకర్లు..

ముంబయి ఇండియన్స్ గత సీజన్ విజేత కావడంతో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్ల లిస్టులో వరుగా 5, 6, 7 స్థానాల్లో నిలిచారు. వీరిలో ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ 500+ పరుగులు చేయడం విశేషం. ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌లలో 57.33 సగటుతో 516 పరుగులు చేశాడు. 4 అర్దసెంచరీలు చేసిన కిషన్ అత్యధిక స్కోర్ 99 పరుగులు. క్వింటన్ డి కాక్ 16 మ్యాచ్‌లలో 35.90 సగటుతో 503 పరుగులు చేశాడు. గత సీజన్‌లో అత్యధిక సిక్సులు (30) కొట్టిన బ్యాట్స్‌మాన్‌గా కిషన్ రికార్డు సృష్టించాడు. 4 అర్దసెంచరీలు చేసిన డి కాక్ అత్యధిక స్కోర్ 78 నాటౌట్. ఇక సూర్యకుమార్ యాదవ్ 16 మ్యాచ్‌లలో 40 సగటుతో 480 పరుగులు చేశాడు. 4 అర్దసెంచరీలు చేసిన సూర్య అత్యధిక స్కోర్ 79 నాటౌట్. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్‌లో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అతి తక్కువ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసి నిలకడైన బ్యాట్స్‌మాన్‌గా గుర్తింపుపొందాడు.

వారేవా వార్నర్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత సీజన్‌లో బ్యాటుతో రెచ్చిపోయాడు. ఐపీఎల్‌ ప్రతీ సీజన్‌లో వార్నర్ తమ బ్యాటుతో మెరుపులు మెరిపిస్తూ టాప్ 5 స్కోరర్లలో ఒకడిగా నిలుస్తుంటాడు. గత సీజన్‌లో 548 పరుగులతో 3వ స్థానంలో నిలవడమే కాకుండా జట్టును ప్లేఆఫ్స్ వరకు నడిపించాడు. జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్‌సన్‌తో కలసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 39.14 సగటుతో 548 పరుగులు చేశాడు. మొత్తం 4 అర్ద సెంచరీలు నమోదు చేసిన వార్నర్ అత్యధిక స్కోర్ 85 నాటౌట్. 13వ సీజన్‌లో వార్నర్ మొత్తం 52 ఫోర్లు, 14 సిక్సులు బాదడం విశేషం. ఈ సారి కూడా సన్ రైజర్స్ అభిమానులు అతడి నుంచి మరికొన్ని భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తొలి సారి ఫైనల్స్‌కు చేర్చిన ఘనత శ్రేయస్ అయ్యర్‌కే దక్కుతుంది. అతడు బ్యాట్స్‌మాన్‌గా కూడా ముందుండి జట్టును నడిపించాడు. గత సీజన్‌లో ఆ జట్టు తరపున ధావన్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ గత సీజన్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 34.60 సగటుతో 519 పరుగులు చేశాడు. మొత్తం 3 అర్దసెంచరీలు చేసిన అయ్యర్ అత్యధిక స్కోర్ 88 నాటౌట్.

పొలార్డ్.. టాప్ స్ట్రైకర్

ఐపీఎల్ 13వ సీజన్‌లో అందరి కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన బ్యాట్స్‌మాన్‌గా ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ కిరాన్ పొలార్డ్ రికార్డు సృష్టించాడు. గజ్జల్లో గాయం కారణంగా ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమవడంతో పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో తన బ్యాటుతో పలు మ్యాచ్‌లను గెలిపించాడు. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 12 ఇన్నింగ్స్‌లలోనే బ్యాటింగ్ చేసిన పొలార్డ్ 53.60 సగటుతో 268 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 191.42గా ఉండటం గమనార్హం. కేవలం ఒకే అర్ద సెంచరీ (60 నాటౌట్) చేసిన పొలార్డ్ సీజన్ మొత్తం కలిపి 22 సిక్సులు బాదడం విశేషం.

వీరితో పాటు దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ తెవాతియా, నితీష్ రాణా, జానీ బెయిర్‌స్టో, వంటి బ్యాట్స్‌మాన్ కూడా చక్కని పరుగులు సాధించారు.

గత సీజన్ టాప్ 10 స్కోరర్స్

1. కేఎల్ రాహుల్ – పంజాబ్ కింగ్స్ (670 పరుగులు)
2. శిఖర్ ధావన్ – ఢిల్లీ క్యాపిటల్స్ (618)
3. డేవిడ్ వార్నర్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (548)
4. శ్రేయస్ అయ్యర్ – ఢిల్లీ క్యాపిటల్స్ (519)
5. ఇషాన్ కిషన్ – ముంబయి ఇండియన్స్ (516)
6. క్వింటన్ డి కాక్ – ముంబయి ఇండియన్స్ (503)
7. సూర్యకుమార్ యాదవ్ – ముంబయి ఇండియన్స్ (480)
8. దేవ్‌దత్ పడిక్కల్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (473)
9. విరాట్ కోహ్లీ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (466)
10. ఏబీ డివిలియర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (454)

Advertisement

Next Story

Most Viewed