ఐపీఎల్ రద్దుకు బీసీసీఐ సంకేతాలు !

by Shamantha N |
ఐపీఎల్ రద్దుకు బీసీసీఐ సంకేతాలు !
X

బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్నతీరును చూస్తుంటే ఏప్రిల్ 15న కూడా ఐపీఎల్ ప్రారంభం కావడం అనుమానంగానే కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం బీసీసీఐ మంగళవారం ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేసింది.

ఇక చర్చించడానికి ఏమీ లేదు.. ఏప్రిల్ 15 నుంచైనా ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలు లేవు. దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. పలు రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసేసుకున్నాయి. దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి. ఈ సమయంలో ఐపీఎల్ గురించి మాట్లాడే అవసరం ఏముందని కాన్ఫరెన్స్ రద్దు చేసినట్టు.. పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలపడం విశేషం. ‘ఈ క్షణంలో నేను ఐపీఎల్ గురించి ఏమీ ఆలోచించడం లేదు.. కేవలం ఇప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంపైనే దృష్టిపెట్టానని’ సదరు అధికారి చెప్పారు.

మరోవైపు ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. ఇక ఐపీఎల్ గురించి చర్చించడానికి ఎలాంటి సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ నిర్వహణపై కీలక ప్రకటన చేస్తామని చెప్పారు. బ్రిజేష్ పటేల్, మరో బీసీసీఐ అధికారి మాటల ప్రకారం ఐపీఎల్ రద్దు దిశగానే బీసీసీఐ ఆలోచనలు చేస్తోందని.. ఇప్పటికే ఫ్రాంచైజీ యాజమాన్యాలకు కూడా ఈ విషయం తేల్చి చెప్పినట్లు సమాచారం.

Tags: IPL, Franchise, cancelled, BCCI, schedule, lockdown, Brijesh Patel

Advertisement

Next Story

Most Viewed