జోరుగా బెట్టింగ్​..!

by  |
జోరుగా బెట్టింగ్​..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: “బాల్​ టు బాల్​.. రన్​ టు రన్‌.. మినెట్​ టు మినెట్​.. ప్రతీ క్షణం అప్​డేట్​.. పెట్టుబడి మీరు పెట్టండి.. కలిసొస్తే గంటల వ్యవధిలోనే మూడు నాలుగు రెట్లు సంపాదించండి.. ఇంట్లో ఉండే కార్యం చక్కబెట్టుకోవచ్చు.. గడపదాటాల్సిన అవసరం లేదు.. అంతా ఆన్​లైన్​ పేమెంట్లే.. స్మార్ట్​ పే ఉంటే చాలు.. కాసుల పంట పండినట్టే..’’ అంటూ బుకీలు ఆశలు రేపుతున్నారు. అత్యాశకు పోయి బెట్టింగ్​ రాయుళ్లు ఐపీఎల్​ పేర ఆస్తులు సమర్పించుకుంటున్నారు. సిరీస్​ ఆరంభమైన మొదటి రోజే జిల్లాలో ఆరుగురి అరెస్ట్​ జరిగిందంటే నిజామాబాద్​ జిల్లాలో దందా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. కాగా, చాపకింద నీరులా నడుస్తున్న ఆన్​లైన్​ బెట్టింగ్​ ఇటు పోలీసులకు, అటు యువత తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ నెల 19న సాయంత్రం ఐపీఎల్​ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. అదే రోజు నిజామాబాద్ నగర సీఐ సత్యనారాయణ, త్రీ టౌన్ ఎస్సై సంతోష్ గుర్బాబాది రోడ్డులోని పవన్ నగర్‎లో త్రివేది హరి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. పెద్ద స్ర్కీన్​పై క్రికెట్​చూస్తూ ఆన్‎లైన్‎లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. వారి నుంచి 11 సెల్ ఫోన్లు, రూ.42 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారం దుమారాన్నే రేపింది. ఖాతాల్లోకి డబ్బులు..వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఆన్‎లైన్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బుకీలు పేరున్న వారు ఇప్పుడు ఆన్‎లైన్‎లో ఆఫర్లతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు తమ ఖాతాలో వేయించుకుని ఆన్‎లైన్ బెట్టింగ్ దందాకు తెరలేపారు. సెల్‎ఫోన్​ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ​బెట్టింగ్ చాలామంది జీవితాలను తారుమారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బెట్టింగ్ కోసం బుకీలు ఆన్‎లైన్‎లో ప్రత్యేకంగా ఓ యాప్‎నే రూపొందించుకున్నారు. దానికి తోడు ఇతరుల పేరుతో తీసుకున్న కొన్ని సిమ్​లతో దందా జోరుగా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు బుకీలు ప్రతీ యేటా బెట్టింగ్ లో ఏజెంట్ల నంబర్లు తీసుకుని ఐపీఎల్ బెట్టింగ్‌లు కడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా లక్షల్లో మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారం బుకీలు, ఏజెంట్లు 10 శాతం కమీషన్ మిగిల్చుకుని మిగతా గెలిచిన సొమ్మును ఇచ్చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నగరం, పట్టణం అని తేడా లేకుండా ఈ బెట్టింగ్​గ్రామాలకు సైతం పాకిందనే వార్తలు వినవస్తున్నాయి. చిన్నాపెద్ద తేడా లేక రూ.లక్షల్లో ఆన్ లైన్ రూపంలో చేతులు మారుతున్నట్టు సమాచారం.

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ ప్రారంభమైన రోజే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ బీజేపీ యువనేతతో పాటు ఆరుగురు వ్యక్తులు పట్టుబడడంతో ​దందా షురూ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ ​బుకీలకు తోడు నాందేడ్, ఔరంగాబాద్ కేంద్రంగా నిజామాబాద్ ​ఉమ్మడి జిల్లాలో ఆన్‎లైన్ బెట్టింగ్ దందా జోరుగా జరుగుతోంది. నిర్వాహకులుగా పెద్ద తలలు ఉండడంతో చాలా వరకు చిన్నా చితకా పందేలు కాసేవారే పట్టుబడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. పోలీసులు ఆన్‎లైన్ బెట్టింగ్‎కు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే విద్యార్థులు, యువత, వ్యాపారులు తమ జీవితాల్ని నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో బెట్టింగ్​ తో ఓ సీఏ తనయుడు అప్పులపాలై బలవన్మరణం పొందిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూడాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed