- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండింగ్.. రేపే ఐపీఎల్ మినీ వేలం
దిశ, స్పోర్ట్స్ : వీవో ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించిన కీలక అంకానికి గురువారం తెరపడనుంది. ఇటీవల ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో పాటు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని బీసీసీఐ వేలం వేయనున్నది. ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో జరిగే ఈ వేలంలో 292 మంది ఆటగాళ్లను అందుబాటులో ఉంచారు. కాగా, ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సమాచారాన్ని బీసీసీఐకి అందజేసింది. ఇంకా ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు, ఎంత పర్స్ వాల్యూ అందుబాటులో ఉన్నదనే విషయాలను కూడా బోర్డుకు తెలియజేశారు.
ఇక, ఐపీఎల్ 14వ సీజన్‌లో కొన్ని రోజుల పాటు న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉండరని.. ఆ దేశాలకు చెందిన ఆటగాళ్లను కొనుగోలు చేసే ఫ్రాంచైజీలు వారిని ఆ మేరకు విడుదల చేయాలని నిబంధన విధించింది. గురువారం జరిగే వేలంలో కనీస ధర రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. రూ. 2 కోట్ల ఆటగాళ్లు 10 మంది, రూ. 1.5 కోట్ల ఆటగాళ్లు 12 మంది, రూ. 1 కోటి ఆటగాళ్లు 11 మంది, రూ. 75 లక్షల ఆటగాళ్లు 15 మంది, రూ. 50 లక్షల ఆటగాళ్లు 65 మంది మొత్తం 292 మంది వేలంలో అందుబాటులో ఉన్నారు.
వాళ్లు అందుబాటులో ఉండరు..
ఐపీఎల్ 14వ సీజన్ తొలి రెండు వారాల పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో ఉండరని బీసీసీఐ తెలియజేసింది. పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడాల్సి ఉండటంతో జాతీయ జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లు తొలి రెండు వారాలు ఐపీఎల్ ఆడబోరని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు ఇంగ్లాండ్, న్యూజీలాండ్ మధ్య జూన్ 2 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరుగనున్నది. దీంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ చివరి రెండు వారాలు అందుబాటులో ఉండరు. ఆయా ఫ్రాంచైజీలు ఈ మూడు దేశాల ఆటగాళ్లను ఆ మేరకు విడుదల చేయాలని.. మినీ వేలంలో కొనుగోలు చేసే ముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బిడ్డింగ్ వేయాలని బీసీసీఐ కోరింది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీల వద్ద న్యూజీలాండ్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. కేన్ విలియమ్‌సన్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, సామ్ కర్రన్‌లు ఐపీఎల్‌లో పూర్తిగా అందుబాటులో ఉండకపోవడంతో వారి స్థానంలో వేరొక ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ట్రేడ్ విండో మళ్లీ ఓపెన్..
వీవో ఐపీఎల్ 2021కి సంబంధించిన ట్రేడ్ విండోను ఈ ఏడాది జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఉంచాయి. ఏవైనా రెండు ఫ్రాంచైజీలు అధికారికంగా ఆటగాళ్లను బదిలీ చేసుకోవడానికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇక రెండో దశ ట్రేడ్ విండోను ఫిబ్రవరి 19 నుంచి మళ్లీ తెరవనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. గురువారం మినీ వేలం ముగిసిన వెంటనే ఈ ట్రేడ్ విండోను అందుబాటులో ఉంచుతారు. వేలంలో సరైన ఆటగాడు దొరకలేదని భావించిన ఫ్రాంచైజీలు ఇతర జట్లతో మాట్లాడుకొని ఆటగాళ్లను బదిలీ చేసుకునే అవకాశం ఇస్తారు.
కాగా, ట్రేడ్ విండో ద్వారా బదిలీ అయ్యే ఆటగాళ్లపై కొన్ని ఆంక్షలు ఉండటం వల్ల గత కొన్ని సీజన్లుగా ఈ అవకాశాన్ని ఏ ఫ్రాంచైజీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించడం లేదు. ఈ ఏడాది తొలి దశ ట్రేడ్ విండోలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్స్ డానియల్ సామ్స్, హర్షల్ పటేల్‌లను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్ల బదిలీ తప్ప ఈ ఏడాది మరో ట్రేడ్ జరగలేదు. దీంతో ఫ్రాంచైజీలకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.