ఐఫోన్‌పై మనసుపడ్డ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ

by Shyam |
ఐఫోన్‌పై మనసుపడ్డ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్, లాక్‌డౌన్ ప్రభావంతో సామాన్యులతో పాటు ప్రభుత్వంపైనా ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది వేతనాల్లో ప్రభుత్వం కోత విధిస్తూ వస్తోంది. ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటున్న ఆపత్కాలంలో సైతం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ విలాస వస్తువులకే మొగ్గు చూపుతుండటం విశేషం. బల్దియాలోని స్టాండింగ్ కమిటీలోని సభ్యులకు ఐ-ఫోన్‌లు కొనాలని తాజా సమావేశంలో చర్చించారు. అప్పులు తెచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తుండగా, లాక్‌డౌన్ కష్టాలను తట్టుకునేందుకు అధికారుల వేతనాల్లోనూ కోత విధించారు. ఆర్థిక లోటుతో నెట్టుకొస్తున్న జీహెచ్ఎంసీలోని అత్యున్నత స్టాండింగ్ కమిటీ సభ్యులు మాత్రం ఐ-ఫోన్‌లపై మనసుపడ్డారు. స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులుండగా.. ఐ-ఫోన్ 11 ప్రోం మాక్స్ మొబైళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో మొబైల్ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.1.32 లక్షల ఖరీదుతో సుమారు రూ. 19.84 లక్షలతో ఐఫోన్లు కొనాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్ కష్టకాలంలో ఇంత ఖరీదైన మొబైళ్లు అవసరమా అనేదానికి కూడా స్టాండింగ్ కమిటీ సభ్యుల వద్ద సమాధానం ఉంది. కరోనా ప్రభావంతో పాటు ఈ-గవర్నెన్స్ పాలన సాగుతున్న నేపథ్యంలో అప్‌గ్రేడ్ టెక్నాలజీ తమకు అందుబాటులో ఉండాల్సిన అవసరముందనేది ఓ సభ్యుడి వివరణ.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఒక ఏడాది పదవీ కాలంతో పని చేస్తుంది. గతేడాది ఎన్నికైన ఈ కమిటీ ప్రతీ గురువారం సమావేశమయ్యి, జీహెచ్ఎంసీ పరిధిలో నిర్ణయాలపై చర్చించి ఆమోదిస్తారు. ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న తాజా నిర్ణయాన్ని ఈ నెల 4న (గురువారం) నిర్వహించిన సమావేశంలో చర్చించారు. అయితే జూన్ 6(శనివారం) తో ఈ స్టాండింగ్ కమిటీ పదవీకాలం ముగిసిపోయింది. కొత్త కమిటీ కోసం కమిషనర్ కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీ పదవీకాలం ముగిసే రెండు రోజుల ముందే ఐఫోన్లు తీసుకోవడం ప్రజల్లో చర్చకు దారితీస్తుందని భావించిన సభ్యులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీలో కాకుండా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఉన్న విశేష అధికారాల ద్వారా కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అలా చేసిన వాళ్లకు ఐఫోన్లు వచ్చేలా కనిపించడం లేదు. స్టాండింగ్ కమిటీ పదవీకాలం ముగియడంతో కొత్తవారిని ఎన్నుకుంటారు. జీహెచ్ఎంసీ కొత్తగా మొబైళ్లు కొనుగోలు చేసేందుకు నిర్ణయించినా కొత్త వారికే వస్తాయి. అందినట్టే అంది చేజారిపోయిన ఐఫోన్లు ఇక తమకు దక్కే అవకాశం లేదని ఇప్పటివరకు ఉన్న కమిటీ సభ్యులు బాధ పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed