- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మదుపర్ల చూపు భారత్ వైపే : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందిందని, యావత్ లోకం ఇండియావైపే చూస్తున్నదని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విదేశీ మదుపరులందరూ భారత్‌పై ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. కరోనాకాలంలోనూ భారీగా ఎఫ్‌డీఐలు, ఎఫ్‌పీఐలు వచ్చాయని, తాము తీసుకువచ్చిన కొత్త చట్టాల విజయానికి ఇవే నిదర్శనమని స్పష్టం చేశారు. విదేశీ మదుపర్లలో ఒకప్పుడు భారత్‌లో పెట్టుబడులు ఎందుకు? అనే చూపు ఉండేదని, ప్రస్తుతం ఈ దృక్పథం భారత్‌లో ఎందుకు వద్దు? అనే వరకు చేరిందని వివరించారు.
అసోచాం ఫౌండేషన్ నిర్వహించిన ఓ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు చేసిందని, వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని తెలిపారు. సాగు చట్టాలూ ఫలితాలనిస్తున్నాయని అన్నారు. మారుతున్న మదుపర్ల ఆలోచన ధోరణికి అనుగుణంగా కొత్త చట్టాలు చేశామని, ఆటంకాలుగా మిగిలిన 1,500 చట్టాలను రద్దు చేశామని వివరించారు. గతంలో అనేక చట్టాలు, కండీషన్లు మదుపర్ల ఆసక్తిని తగ్గించేవని, భారత్‌లో పెట్టుబడులు పెట్టడం అవసరమా? అనే స్థాయికి వారిని దిగజార్చేవని, కానీ, కొత్త చట్టాలతో ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయవద్దు? అని స్వీయ పరిశీలన చేసుకునే వరకు చేరిందని అన్నారు.
కొత్త భారతం ఆత్మనిర్భర్ భారత్ వైపు ప్రయాణిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం దృష్టి ప్రధానంగా ఉత్పత్తి, తయారీ రంగంపై ఉంటుందని, వాటితో దేశీయంగా సదుపాయాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని వివరించారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడులు పెంచాల్సిన అవసరమున్నదని అన్నారు. దేశీయ సరుకులను అంతర్జాతీయ విపణికి తీసుకువెళ్లాలనుకుంటున్నందున విదేశీ వ్యవహారాలు, వర్తకం, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని చెప్పారు. అలాగే, పరిశ్రమవర్గాలు విలువైన సూచనలివ్వాలని కోరారు.