- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ 2024.. ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు.. టీడీపీ భారీ స్కెచ్..?
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో విపక్ష కూటమికి రంగం సిద్ధమైందా అన్న వార్తలు ఊపందుకున్నాయి. అధికార వైసీపీని 2024లో ఢీ కొట్టాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏమాత్రం చీలనివ్వకూడదనే ఆలోచనలో ప్రతిపక్షాలు పడ్డాయి. ఇటీవల అనుకోని రీతిలో జనసేన కార్యాలయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లడం ఈ ఊహాగానాలకు బలమిచ్చింది.
నారా లోకేశ్ అనూహ్య చర్య..
ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో పర్యటిస్తున్న నారా లోకేశ్ అనూహ్యంగా అక్కడి జనసేన కార్యాలయంలోనికి వెళ్లారు. అక్కడ రంగా విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన ఆయన జనం ఎక్కువగా ఉండడంతో జనసేన కార్యాలయంలోనికి వెళ్లి అక్కడి నేతలను పలకరించారు. చాలా యథాలాపంగా జరిగిపోయినట్టున్న ఈ చర్య రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలను కళ్లకు కట్టినట్టు చూపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఏపీలో విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానాలు మొదలయ్యాయి.
మరో మహాకూటమికి బీజం పడనుందా..
2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన మహాకూటమి ఒక పెద్ద సంచలనం. అప్పటి అధికార కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇది ఒక బలమైన ఎత్తుగడే అయినప్పటికీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యూహాల ముందు కూటమి ఓటమిపాలైంది. నిజానికి ఈ కూటమికి ఒక కామన్ ఎజెండా అంటూ లేకుండా కేవలం వైఎస్‌ను గద్దె దింపడం అనే ఒకే ఒక్క ఎత్తుగడతో ఏర్పడటమే మహాకూటమి ఓటమికి ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతుంటారు. ఆ తప్పులు జరగకుండా ఈసారి విపక్షాలు ఏకం కావాలని కొన్ని పార్టీలు ముఖ్యంగా టీడీపీ భావిస్తున్నది.
సంఖ్యాపరంగా వైసీపీ బలం..
ఇప్పటికైతే ఏకంగా 151 ఎమ్మెల్యేలతో వైసీపీ చాలా బలంగా కనపడుతున్నది. కానీ, గడిచిన రెండున్నరేళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా అలానే పెరిగింది. పెరుగుతున్న అప్పులు, ఓటీఎస్ లాంటి స్కీంలు, ఇసుక-మద్యం పాలసీల వంటి కారణాలతో మధ్యతరగతి ప్రజల్లో కొంతమేర అసహనం పేరుకుంది. అయితే అదే సమయంలో విపక్షాలు బలహీనంగా ఉండడం, కాస్త పేరున్న నేతలూ పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయం లేదు అనే అభిప్రాయం సామాన్య జనాల్లో ఉంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్షాలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోవడానికి ఇవే కారణాలని ఒక అంచనా.
2019 నాటి తప్పులు సరిదిద్దుకుంటున్న టీడీపీ
అవునన్నా.. కాదన్నా 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఒక అవహగానతో పనిచేశాయన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే ఆ విషయాన్నీ రెండు పార్టీలు బహిరంగంగా ఒప్పుకోకపోవడం వాటికే నష్టం చేకూర్చింది. ఈ వార్తలు ప్రజల్లో ఒకవిధమైన అయోమయం కలిగించాయి. ఓటు ఎటువైపు అన్నదీ ప్రజలూ తేల్చుకోలేకపోయారు. దాంతో 49.95 శాతం ఓటు షేర్‌తో వైసీపీ గెలుపొందింది. 39.99 శాతంతో టీడీపీ, 5.53 శాతంతో జనసేన ఓటమి పాలయ్యాయి. ఈసారి ఆ పొరపాటు జరగకూడదని టీడీపీ భావిస్తున్నది. భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా అధికారికంగానే పొత్తుల వైపు దృష్టి సారిస్తున్నట్టు కనబడుతున్నది.
అందులో భాగంగా జనంలో సినీ హీరోగా విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన వైపు చూస్తున్నది. మరోవైపు పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు అయినా ఇంకా క్షేత్ర స్థాయిలో పూర్తిస్థాయిలో బలోపేతం కాని జనసేనకు కూడా ఒక బలమైన పార్టీ అండ కావాలన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తు ఈసారి కన్ఫర్మ్ అంటున్నారు రాజనీతిజ్ఞులు. అమరావతి సభ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం లాంటి అంశాల్లో ఒకరికి ఒకరు మద్దతుగా మాట్లాడుతుండడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయం కూడా జనంలో కలుగుతున్నది.
బీజేపీకి దగ్గర దారి.. జనసేన ద్వారానే..
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చినా ఆ కలయిక కేవలం మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తున్నదంటూ టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. దీంతో రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బీజేపీ నేతలు మాణిక్యాల రావు, కామినేని లాంటి వాళ్లు రాజీనామా చేసి వైదొలిగారు. అప్పటి నుంచి టీడీపీ, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ధర్మపోరాట దీక్షల పేరుతో టీడీపీ నేతలు బీజేపీనీ, మోడీని కాస్త హద్దు దాటి విమర్శించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అయితే ప్రస్తుతం కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో జతకట్టాలంటే టీడీపీకి జనసేన పార్టీనే మంచి వారధిగా కనపడుతున్నది. పవన్ కల్యాణ్ పట్ల బీజేపీ చూపిస్తున్న ఆదరణ దానికొక అవకాశం అని టీడీపీ భావిస్తున్నది. అటు రాష్ట్ర స్థాయిలో బీజేపీకి, వైసీపీకి మధ్య కూడా విమర్శ -ప్రతివిమర్శలు గట్టిగానే జరుగుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో జనసేన ద్వారా బీజేపీకి దగ్గరైతే అధికార వైసీపీకి చెక్ పెట్టొచ్చని టీడీపీ భావిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ వేస్తున్న అడుగులు కూడా ఈ ఊహలకు ఊతమిస్తున్నాయి.
విపక్షాల వ్యూహం ఫలించేనా..
అయితే రాష్ట్రంలోని పరిస్థితులు విపక్షాల వ్యూహాలకు అవాంతరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కులాల వారీగా విడిపోయి ఉన్న రాష్ట్ర ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురావాలంటే విపక్షాలు రూపొందించే కామన్ ఎజెండా చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి. 2009లో చేసినట్టు కేవలం అధికార పార్టీని గద్దె దించడం అనే ఏకైక ఎజెండాతో వెళుతున్నామని చెబితే మాత్రం ప్రజల నమ్మకం దొరకబుచ్చుకోవడం మళ్లీ విపక్షాలకు అసాధ్యమే కావొచ్చు.